PPM: ఈనెల 21న స్దానిక ఎంప్లాయిమెంట్ ఆఫీస్ ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి వహీదా గురువారం తెలిపారు. 4 కంపెనీల్లో వివిధ రకాల పోస్టులకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తారని18 ఏళ్లు పైబడిన స్త్రీ,పురుష అభ్యర్థులు అర్హులన్నారు.250 ఖాళీలు ఉన్నాయని అబ్యర్దులు ఉదయం 10కి ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఇంటర్వ్యూకు హజరు కావాలని తెలిపారు.
SKLM: భార్యను తుపాకీతో చంపిన కేసులో భర్తకు జీవిత ఖైదు విధిస్తూ గురువారం జడ్జి కె. కిషోర్ బాబు తీర్పు వెల్లడించినట్లు ఎస్పీ మహేశ్వరరెడ్డి తెలిపారు. మెళియాపుట్టి M భరణికోటకి చెందిన ఎస్ .పద్మను భర్త జగ్గారావు 2021 లో నాటు తుపాకీతో కాల్చి చంపాడు. అప్పట్లో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేశారు. నేరం రుజువు కావడంతో శిక్ష విధించినట్లు SP తెలిపారు.
గుంటూరు: మంత్రి నారా లోకేశ్ ఉండవల్లిలోని తన నివాసంలో ఉన్నత విద్యాశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. విద్యాసంస్థల్లో అమలు చేస్తున్న ముఖ గుర్తింపు విధానంపై పురోగతిని పరిశీలించారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసి, విద్యార్థులకు ఉత్తమ వాతావరణం కల్పించాలని అధికారులను ఆదేశించారు.
CTR: ‘జలధార-నీటి భద్రత’ పనులతో చిత్తూరు జిల్లాలో భూగర్భ జలమట్టం పెరిగేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశించారు. 3,106 చెరువుల్లో ఉపాధి హామీ పథకం కింద పనులు చేపట్టాలని సూచించారు. నీటి నిల్వల పెంపు, సాగునీటి బలోపేతం, కరువు నివారణకు చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రతి ఫీల్డ్ అసిస్టెంట్‌కు 3 చెరువులు కేటాయించి, అధికారులు బాధ్యతగా పనిచేయాలన్నారు.
AKP: సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని నక్కపల్లి ఎంపీడీవో కే.చలపతిరావు పంచాయతీ కార్యదర్శులను ఆదేశించారు. గురువారం ఉపమాక పంచాయతీ ప్రత్యేక అధికారిగా బాధ్యతలు స్వీకరించారు. గ్రామాల అభివృద్ధికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తామన్నారు. సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి పెడతామన్నారు.
VZM: ఎంపీ లాడ్స్ నిధులతో చేపట్టిన అభివృద్ధి పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని కలెక్టర్ రాంసుందర్ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఎంపీ లాడ్స్ పనుల ప్రగతిపై వివిధ శాఖల అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలో ఎంపీ నిధులతో మంజూరైన పనులు వివిధ దశల్లో పెండింగ్ ఉండటంపై కలెక్టర్ అసహనం వ్యక్తం చేశారు.
VZM: ఎంపీ లాడ్స్ నిధులతో చేపట్టిన అభివృద్ధి పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని కలెక్టర్ రాంసుందర్ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఎంపీ లాడ్స్ పనుల ప్రగతిపై వివిధ శాఖల అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలో ఎంపీ నిధులతో మంజూరైన పనులు వివిధ దశల్లో పెండింగ్ ఉండటంపై కలెక్టర్ అసహనం వ్యక్తం చేశారు.
బాపట్ల: సంతమాగులూరు సర్కిల్ ఇన్‌స్పెక్టర్‌గా పి. శేషగిరిరావు గురువారం బాధ్యతలు చేపట్టారు. చీరాల రూరల్ సర్కిల్ నుంచి బదిలీపై వచ్చిన ఆయన వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య పదవీ బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సంతమాగులూరు సర్కిల్ పరిధిలోని సంతమాగులూరు, బల్లికురవ పోలీస్ స్టేషన్ల వ్యాప్తంగా శాంతిభద్రతల పరిరక్షణకు ప్రత్యేక కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
NLR: కమిషనర్ వై.ఓ. నందన్ ఆదేశాలతో వెటర్నరీ డాక్టర్ మదన్ మోహన్ బృందం గురువారం సాయంత్రం కపాడిపాలెం, బాలాజీ నగర్ ప్రాంతాల్లో ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. ప్రజల ఫిర్యాదుల మేరకు 5 వీధి శునకాలను బంధించి పాత మున్సిపల్ కార్యాలయంలోని ఏబీసీ సెంటర్‌కు తరలించారు. ప్రజలకు ఇబ్బంది కలిగించే జంతువుల నియంత్రణకు ఇలాంటి చర్యలు కొనసాగుతాయని అధికారులు తెలిపారు.
NLR: నెల్లూరు జిల్లా ప్రగతినగర్‌లో జరిగిన రఫీ హత్య కేసులో అతడి అన్న ఖలీల్, మరో నిందితుడు రాజేశ్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. కుటుంబ గొడవలు, ఫంక్షన్ మ్యూజిక్ సిస్టమ్ విషయంలో తలెత్తిన వివాదమే ఈ హత్యకు దారితీసింది. పథకం ప్రకారం రఫీని రోడ్డుపైకి లాక్కొచ్చి కత్తితో పొడిచి చంపిన నిందితులను, రైల్వే స్టేషన్ సమీపంలో దర్గామిట్ట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
KDP: పులివెందుల మున్సిపాలిటీలో ఇంఛార్జ్ కమిషనర్‌గా పనిచేస్తున్న మునికుమార్‌కు ప్రభుత్వం పదోన్నతి కల్పించింది. ఆయనను రెగ్యులర్ మున్సిపల్ కమిషనర్‌గా నియమిస్తూ గురువారం ఉత్తర్వులు జారీ అయ్యాయి.ఇప్పటి వరకు ఇంఛార్జ్ బాధ్యతలు నిర్వహించిన ముని కుమార్, ఇప్పుడు పూర్తి స్థాయి కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించనున్నారు.
ATP: జిల్లా పరిధిలో భూ సర్వే పనులు వేగవంతం చేసేందుకు 247 లైసెన్స్ సర్వేయర్ల నియామకానికి ప్రభుత్వం ఆమోదం తెలిపిందని జాయింట్ కలెక్టర్ (జేసీ) విష్ణు చరణ్ పేర్కొన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు ఈ నెల 30లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అభ్యర్థులు ఆధునిక సర్వే పరికరాలపై శిక్షణ పొంది ఉండాలని, మూడేళ్ల లైసెన్స్ రెన్యువల్ కలిగి ఉండాలని తెలిపారు.
ELR: ఇటీవల గచ్చిబౌలిలో జలపవారిగూడెంకి చెందిన కొబ్బరి బొండాల లోడుతో రోడ్డు పక్కన టైర్ మార్చడం కోసం ఆగి ఉన్న 4 వ్యాన్లను లారీ ఢీకొట్టిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందగా, మరో వ్యక్తి రాచప్రోలు కన్నయ్య 13 రోజులు మృత్యువుతో పోరాడి గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడు. దీంతో గ్రామంలో విషాదం నెలకొంది.
బాపట్ల: చెరుకుపల్లి మండలం రాజోలు గ్రామానికి చెందిన నలుగురిని అధికారులు వెట్టి వ్యవస్థ నుంచి విడుదల చేశారు. కర్లపాలెం ప్రాంతంలో ఓ వ్యక్తి వారి మీద బలవంతపు పని మోపుతున్నట్లు సమాచారం రావడంతో చర్యలు తీసుకున్నారు. బాపట్ల ఆర్డీఓ గ్లోరియా వారికి విముక్తి పత్రాలు అందజేసి, స్వేచ్ఛగా జీవించే హక్కు ప్రతి ఒక్కరికీ ఉందని తెలిపారు.
కోనసీమ: రాయవరం మండలం చెల్లూరులోని పురాతన అగస్తీశ్వరస్వామి ఆలయంలో హుండీ చోరీకి పాల్పడిన నిందితుడు మల్లేష్‌కు గురువారం కోర్టు 14 రోజుల జుడీషియల్ రిమాండ్ విధించింది. ఈ నెల 13న నిందితుడు ఆలయంలోని హుండీని పగలగొట్టి రూ.5వేల నగదుతో పాటు సీలింగ్ ఫ్యాన్‌ను ఎత్తుకెళ్లాడు. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు, నిందితుడిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు.