ATP: కళ్యాణదుర్గం మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత హనుమంతరాయ చౌదరి అంత్యక్రియలు ఆదివారం ఉ.10 గంటలకు నిర్వహించనున్నారు. కళ్యాణదుర్గం మండలం ఎర్రంపల్లి గ్రామంలో ఈ కార్యక్రమం జరగనుంది. అనారోగ్యంతో కన్నుమూసిన ‘పెద్దాయన’కు తుది వీడ్కోలు పలికేందుకు భారీగా అభిమానులు, రాజకీయ నాయకులు తరలిరానున్నారు. ఆయన పార్థివ దేహానికి నివాళులర్పించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు.
కోనసీమ: వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయంలో శనివారం కానూరు కి చెందిన కాశీ చొప్పరపు రమేష్ బాబు, సునీత దంపతులు స్వామి వారిని దర్శించుకుని, ఆలయంలో నిర్వహిస్తున్న అన్నదాన ట్రస్ట్‌కు రూ.50,116లు విరాళం ఆలయ అధికారులకు అందజేశారు. వారికి ఆలయ అర్చకులు స్వామి వారి చిత్రపటం, ప్రసాదం అందజేశారు.
VZM: బంగాళాఖాతంపై ఏర్పడిన ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో నేడు, రేపు వర్షాలు పడే అవకాశం ఉందని APSDMA తెలిపింది. ఇవాళ రాష్ట్రంలోని దాదాపు అన్ని జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. రేపు విజయనగరంపాటు ఇతర జిల్లాలో కూడా వర్షాలు పడతాయని హెచ్చరించింది.
కృష్ణా: పెడన–గుడివాడ రహదారిలో ఈద్గాలో రంజాన్ పర్వదినం దినోత్సవ వేడుకలు శనివారం ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ పాల్గొని,ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సమాజంలో శాంతి, సౌహార్ద్రం నెలకొనాలని ఆకాంక్షిస్తూ, రంజాన్ పర్వదినం అందరికీ ఆనందం, సుఖసంతోషాలు తీసుకురావాలన్నారు.
GNTR: తెనాలి చెంచుపేట ఈద్గాలో నిర్వహించిన రంజాన్ ప్రార్థనల్లో మంత్రి నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు. ముస్లిం సోదరులతో కలిసి నమాజ్ చేసిన ఆయన, అందరికీ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. కఠోర దీక్షల అనంతరం జరుపుకునే ఈ పండుగ అందరి ఇళ్లలో వెలుగులు నింపాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఈద్గా కమిటీ సేవలను అభినందించారు.
అన్నమయ్య: రాజంపేట పట్టణంలోని ఈద్గా మైదానంలో ఈద్-ఉల్-ఫితర్ సందర్భంగా ముస్లిం సోదరులు ఘనంగా వేడుకలు నిర్వహించుకున్నారు. పెద్ద సంఖ్యలో పాల్గొన్న వారు ప్రార్థనల అనంతరం ఒకరినొకరు ఆలింగనం చేసుకుంటూ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈద్గా వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అర్బన్ పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.
NLR: జిల్లాలో అమానుష ఘటన వెలుగులోకి వచ్చింది. ఇటీవల ఏపీ తీరంలోకి వచ్చిన తమిళనాడు బోట్లను మత్స్యకారులు పట్టుకొని జువ్వలదిన్నె హార్బర్ నిలిపారు. అయితే అల్లూరు మండలం ఇస్కపాలెంలోని పల్లి పాలేనికి చెందిన పెద్దకాపు వర్గం వీటిని విడుదల చేయించిందని సమాచారం. దీంతో ఆగ్రహానికి గురైన మత్స్యకారులు ఆ పెద్ద మనిషి, కుటుంబ సభ్యులను తాళ్లతో కట్టి నిర్భంధించారని తెలుస్తోంది.
KRNL: రంజాన్ పండుగ సందర్భంగా నగరంలోని సంతోష్ నగర్ వద్ద ఉన్న ఈద్గాలో నిర్వహించిన ప్రత్యేక ప్రార్ధనలలో MP బస్తిపాటి నాగరాజు పాల్గొన్నారు. ముందుగా ముస్లిం సోదరులతో కలిసి ప్రార్ధనలు చేసిన ఎంపీ అనంతరం వారిని ఆత్మీయంగా ఆలింగనం చేసుకుని రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. స్నేహం, కరుణ, క్రమ శిక్షణ దయగుణాలకు రంజాన్ ప్రతీకగా నిలుస్తుందన్నారు.
NTR: నందిగామ ఈద్గా వద్ద రంజాన్ పర్వదినం సందర్భంగా ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ప్రార్థనల అనంతరం మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్ మోహన్ రావు ఈద్గా చేరుకుని ముస్లిం సోదరులు, సోదరీమణులను కలిసి రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సమాజంలో శాంతి, సౌభ్రాతృత్వం నెలకొనాలని, పరస్పర గౌరవంతో ముందుకు సాగాలని ఆకాంక్షించారు.
సత్యసాయి: జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్ గ్యాస్ వినియోగంపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లాలో గ్యాస్ కొరత లేకుండా ఏజెన్సీలను నిరంతరం తనిఖీ చేయాలని ఆర్డీఓలు, తహసీల్దార్లను ఆదేశించారు. వినియోగదారులు ఇండక్షన్ స్టవ్, సోలార్ సిస్టమ్ వైపు మొగ్గు చూపాలని సూచించారు. హోటళ్లకు గ్యాస్ సిలిండర్లను అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
కృష్ణా: ముస్లిం సోదరులకు ఎమ్మెల్యే రాము రంజాన్ పండగ శుభాకాంక్షలు తెలిపారు. ఈద్ ఉల్ ఫితర్ వేడుకలను ముస్లింలందరూ ఆనందంగా జరుపుకుని అల్లాహ్ దీవెనలను అందుకోవాలని ఆకాంక్షించారు. నెల రోజుల కఠిన ఉపవాస దీక్షల అనంతరం జరుపుకునే రంజాన్ పండగను ముస్లింలు తమ కుటుంబ సభ్యులు, బంధు మిత్రులందరితో ఇంటిల్లిపాది సంతోషంగా జరుపుకోవాలని పిలుపునిచ్చారు.
VZM: రంజాన్ పండుగ పురస్కరించుకుని ముస్లిం సోదర సోదరీమణులందరికీ ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు శుభాకాంక్షలు తెలియజేశారు. శనివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేస్తూ ఈ పవిత్ర రంజాన్ అందరి జీవితాల్లో శాంతి, సౌభ్రాతృత్వం, సహనం, దయా గుణాలు మరింత పెంపొందించేలా ఉండాలని, సమాజంలో ఐక్యత, పరస్పర గౌరవం మరింత బలపడాలని ఆకాంక్షించారు.
VSP: సింహాచలం వరాహ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో శనివారం సహస్రనామార్చన నేత్రపర్వంగా సాగింది. ఆర్జిత సేవల్లో భాగంగా ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని ఉభయ దేవేరులతో మండపంలో అధిష్ఠింపజేశారు. సహస్రనామార్చనలో పాల్గొన్న భక్తుల, గోత్రనామాలతో సంకల్పం చెప్పి పాంచరాత్రాగమశాస్త్రం విధానంలో కమనీయంగా జరిపించారు.
BPT: బల్లికురవ పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం ఉదయం పెను ప్రమాదం తప్పింది. అతివేగంతో వెళ్తున్న ఓ భారీ లారీ అకస్మాత్తుగా అదుపుతప్పి రహదారి పక్కనే ఉన్న పల్లపు ప్రాంతంలోకి దూసుకెళ్లి బోల్తా పడింది. ఈ ప్రమాద సమయంలో లారీ క్యాబిన్‌లో ఉన్న డ్రైవర్, క్లీనర్ స్వల్ప గాయాలతో ప్రాణాపాయం నుంచి బయటపడటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
PPM: కొమరాడ మండలం పరుశురాం పురం గ్రామంలో పిడుగు పడి పాడి ఆవు మృతి చెందినట్లు రైతు ముత్యాలు తెలిపారు. శుక్రవారం రాత్రి ఉరుములు, పిడుగులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఈ సమయంలో ఆవుపై పిడుగు పడడంతో అక్కడికక్కడే ఆవు మరణించిందన్నారు. పాడే జీవనాధారంగా బతుకుతున్న.. తనకు తీవ్ర నష్టం వాటిలిందని ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.