గుంటూరు: తెనాలి చినరావూరు రైల్వే స్టేషన్లో రైలు ఎక్కుతూ జారిపడి చుండూరు మండలం వామనగుంటపాలెంకు చెందిన వెలగా శ్రీనివాసరావు తీవ్రంగా గాయపడ్డాడు. శనివారం రాత్రి 11 గంటల సమయంలో డెల్టా ఎక్స్‌ప్రెస్ ఎక్కుతుండగా ప్రమాదవశాత్తు జారీ పడడంతో ఆయన కాలు నుజ్జునుజ్జు అయింది. అక్కడే ఉన్న తోటి ప్రయాణికులు గమనించి శ్రీనివాసరావును తెనాలి ప్రభుత్వ జిల్లా వైద్యశాలకు తరలించారు.
KKD: ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసంలో కాకినాడ పార్లమెంట్ పరిధిలోని ఎమ్మెల్యేలు, మంత్రులతో శనివారం సమీక్షా సమావేశం జరిగింది. నియోజకవర్గాల అభివృద్ధి, ప్రజా సమస్యలు, సంక్షేమ పథకాల అమలుపై చర్చలు జరిగాయి. ప్రత్తిపాడు ఎమ్మెల్యే వరుపుల సత్య ప్రభ పాల్గొని నియోజకవర్గ అభివృద్ధికి తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు.
బాపట్ల: సంతమాగులూరులో మండల కేంద్రంలోని స్థానిక శాఖ గ్రంథాలయంలో ఆదివారం ‘చదవటం మాకు ఇష్టం’ కార్యక్రమాన్ని ఉత్సాహంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రంథపాలకుడు బాదం విజయభాస్కర్ రెడ్డి మాట్లాడుతూ.. విద్యార్థుల్లో పఠనాసక్తిని పెంపొందించడం, వారిలో దాగివున్న సృజనాత్మకతను వెలికితీయడమే ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశమని తెలిపారు.
CTR: జిల్లాలోని కేజీబీవీ పాఠశాలలో ఆరవ తరగతి, ఇంటర్ ప్రవేశానికి దరఖాస్తు గడువును ఈనెల 20 కి పొడిగించినట్టు సమగ్ర శిక్ష ఏసీపీ వెంకటరమణ తెలిపారు. జిల్లాలోని ఏడు కేజీబీవీ పాఠశాలల్లో10 తేదీ వరకు ఆరవ తరగతికి 693, ఇంటర్ ఫస్టియర్‌కు 670 దరఖాస్తులు అందినట్టు ఆయన వెల్లడించారు. గడువు పెంపు అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.
కోనసీమ: పీ.గన్నవరం పోలీస్ స్టేషన్ పరిధిలోని బురుగుంట గ్రామంలో జిల్లా ఎస్పీ రాహుల్ మీనా ఆదేశాల మేరకు శనివారం రాత్రి పోలీసులు సమావేశం నిర్వహించారు. ఏప్రిల్ 14న జరగబోయే అంబేద్కర్ జయంతి ఉత్సవాల సందర్భంగా అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడమే లక్ష్యంగా SC నాయకులు, గ్రామ పెద్దలు, గ్రామస్తులతో చర్చించి తగు సూచనలు అందించారు.
ATP: ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఈనెల 20వ తేదీ వరకు తీవ్రమైన వడగాలులు వీస్తాయని రేకులకుంట వాతావరణ కేంద్రం శాస్త్రవేత్త నారాయణస్వామి హెచ్చరించారు. పగటి ఉష్ణోగ్రతలు 42 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశం ఉందని, ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల మధ్య ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎండ తీవ్రత దృష్ట్యా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన కోరారు.
CTR: ఎస్‌ఆర్ పురం ద్రౌపదీ సమేత ధర్మరాజుల ఆలయంలో 33వ మహాభారత ఉత్సవాలు ఆదివారం ప్రారంభమయ్యాయి. ఆలయంలో గణపతి, యజ్ఞ పూజలు నిర్వహించారు. ఈనెల 26 వరకు ఉత్సవాలు కొనసాగుతాయని నిర్వాహకులు తెలిపారు. ప్రతిరోజు హరికథా కాలక్షేపం, 17 నుంచి రాత్రి వేళల్లో నాటక ప్రదర్శన ఉంటుందన్నారు. భక్తులు విజయవంతం చేయాలని కోరారు.
ప్రకాశం: కనిగిరిలో ఒంగోలు పార్లమెంట్ సభ్యుడు మాగుంట శ్రీనివాసులురెడ్డి ఆదివారం పర్యటించారు. ఈ సందర్భంగా టీడీపీ కార్యాలయానికి వచ్చిన మాగుంటను స్థానిక టీడీపీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం ఎంపీ మాగుంట కనిగిరిలోని వాసవి మాత విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొనడంతో పాటు భైరవకోన శ్రీ భైరవేశ్వర స్వామి దర్శనానికి బయలుదేరి వెళ్లారు.
ప్రకాశం: అద్దంకి మండలం ధర్మవరం గ్రామంలో శనివారం అర్ధరాత్రి దారుణం జరిగింది. వెంకట కోటిరెడ్డి ఇంటిలోకి ప్రవేశించిన గుర్తు తెలియని ముగ్గురు వ్యక్తులు కర్రలు, రాడ్లతో దాడికి పాల్పడ్డారు. దాడిలో తీవ్రంగా గాయపడి వెంకట కోటిరెడ్డి అక్కడికక్కడ మృతి చెందాడు. మృతుడి భార్య పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ATP: రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత ప్రజా దర్బార్ నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి ఆమె అర్జీలను స్వీకరించారు. సమస్యల తీవ్రతను బట్టి వాటిని నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని ఆమె స్పష్టం చేశారు.
VZM : గంట్యాడ మండలంలోని బోనంగి గ్రామంలో నూతనంగా నిర్మించిన బండి మహంకాళి అమ్మవారి ఆలయ ప్రారంభోత్సవం కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఆదివారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహంకాళి అమ్మవారి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం జరిగింది. మంత్రి శ్రీనివాస్ హోమంలో పాల్గొనడంతో పాటు అమ్మవారికి ప్రత్యేక పూజలు జరిపారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
NLR: ఆర్టీసీ లాజిస్టిక్స్ ద్వారా చాలామంది పార్శిళ్లు పంపిస్తుంటారు. ఇందులో చాలా వస్తువులను కొందరు ఇప్పటికీ తీసుకోలేదు. వీటికి బహిరంగ వేలం వేస్తామని నెల్లూరు లాజిస్టిక్స్ మేనేజర్ కామాక్షి తెలిపారు. ఈనెల 17న ఉదయం 10 గంటలకు నెల్లూరు బస్టాండ్ ప్రాంగణంలో వేలం జరుగుతుందన్నారు. ఆధార్, పాన్ కార్డు తీసుకురావాలని సూచించారు.
E.G: నిడదవోలు నియోజకవర్గాన్ని రాష్ట్రంలో ఆదర్శంగా అభివృద్ధి చేయాలని తల్లి పోలేరమ్మను ప్రార్థించినట్లు మంత్రి కందుల దుర్గేష్ శనివారం తెలిపారు. పెరవలి మండలం ముక్కామల గ్రామంలో జరిగిన శ్రీ పోలేరమ్మ అమ్మవారి ఉత్సవాల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, ప్రజల సంక్షేమం కోసం ఆకాంక్షించారు.
PPM: గుమ్మలక్ష్మీపురం ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజనులు తమ సంప్రదాయ పద్ధతుల్లో వేసవి వరి పంటను పండిస్తూ ఆకట్టుకుంటున్నారు. కొండవాగుల నుంచి వచ్చే సహజ జలాలను వినియోగిస్తూ నీటి కొరత మధ్య కూడా పంటలను సాగు చేస్తున్నారు. కష్టపడే తత్వం, ప్రకృతితో అనుసంధానం గల జీవన విధానం గిరిజనుల ప్రత్యేకతగా నిలుస్తోంది. వారి కృషితో పచ్చని పంట పొలాలు కళకళలాడుతున్నాయి.
KDP: ఒంటిమిట్ట మండలంలోని కుడమలూరులో ఇవాళ అంకాలమ్మ తిరునాలు నిర్వహించనున్నట్లు ఉత్సవ కమిటీ ప్రతినిధులు తెలిపారు. ఈ సందర్భంగా అమ్మవారి ఆలయాన్ని విద్యుత్తు దీప కాంతులతో అలంకరించారు. కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కమిటీ వివరించింది. గ్రామానికి బంధువులు, మిత్రులు తరలిరావడంతో పండగ వాతావరణం నెలకొంది.