VZM: రాజాం మున్సిపాలిటీ పరిధిలో నిర్వహిస్తున్న పశు మాంసం దుకాణంపై మున్సిపల్ అధికారులు ఇవాళ దాడులు నిర్వహించారు. పశు మాంసం విక్రయించే దుకాణంలో తనిఖీ చేయగా సుమారు 25 కిలోలు ఆవు మాంసం లభ్యమైనట్లు శానిటరీ ఇన్‌స్పెక్టర్ ప్రసాద్ తెలిపారు. దుకాణానికి రూ.5000 జరిమానా విధించారు.
GNTR: గోరంట్లకు చెందిన వెంకటేష్‌ను కలవాలంటూ KVP కాలనీకి చెందిన లక్ష్మి గత కొంతకాలంగా వేధిస్తోంది. ఈ క్రమంలో నిన్న రాత్రి వెంకటేష్ కారులో వెళ్తుండగా, అరండల్‌పేట PS వద్ద లక్ష్మి తన అనుచరులతో కలిసి అతడిని అడ్డగించింది. రాళ్లతో కారు అద్దాలు ధ్వంసం చేసి, చంపేస్తామని బెదిరించింది. బాధితుడి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ప్రకాశం: కంభం మండలం కందులాపురంలో హౌస్ టాక్స్ వసూళ్లు, UF సర్వే పనులను ఎంపీడీవో వీరభద్రచారి మంగళవారం పరిశీలించారు. గ్రామంలో సర్వే పురోగతిని అధికారులు, సిబ్బందితో కలిసి సమీక్షించారు. మిగిలిన గృహాల నుంచి త్వరగా పన్నులు రాబట్టాలని సూచించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సర్వే నిర్వహించాలని ఎంపీడీవో ఆదేశించారు.
KDP: వేంపల్లె పట్టణంలోనీ పలు లాడ్జీల్లో పోలీసులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. సోమవారం ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు వేంపల్లె సీఐ నరసింహులు పలు లాడ్జీల్లో రికార్డులను పరిశీలించారు. లాడ్జీ సిబ్బందిని అడిగి వివరాలు సేకరించారు. వేంపల్లె సీఐతో పాటు చక్రాయపేట, ఆర్కేవ్యాలీ పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు. అనుమానితులు కనిపిస్తే పోలీసులకు సమాచారం అందించాలన్నారు.
PLD: పిడుగురాళ్ల పట్టణ ప్రజలకు ఆస్తి పన్నుపై వడ్డీ మాఫీ చేస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావు ప్రకటించారు. ఈ నెల 16 నుంచి 31వ తేదీలోపు పన్ను చెల్లించే వారికి పాత వడ్డీ బకాయిలను పూర్తిగా రద్దు చేస్తున్నట్లు వెల్లడించారు. ప్రభుత్వం కల్పించిన ఈ అవకాశాన్ని పట్టణ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
ATP: తాడిపత్రి మాజీ ఎమ్మెల్యేలు జేసీ దివాకర్ రెడ్డి, జేసీ ప్రభాకర్ రెడ్డిని వ్యాలీ గ్రీన్ గార్మెంట్ అధినేత పెరుమాళ్ల జీవానంద రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. మంగళవారం ఉదయం వారి స్వగృహానికి వెళ్లిన ఆయన జేసీ సోదరుల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. స్నేహపూర్వక వాతావరణంలో జరిగిన ఈ భేటీలో పలు అంశాలపై చర్చించారు.
ASR: ఆదివాసీ రైతులు పండించిన కాఫీ గింజలను జీసీసీ కొనుగోలు చేయాలని గిరిజన సంఘం చింతపల్లి మండల కార్యదర్శి సాగిన చిరంజీవి డిమాండ్ చేశారు. సోమవారం యర్రబంద గ్రామంలో రైతులతో కలిసి గిరిజన సంఘం నాయకులు ఆందోళన చేశారు. జనవరి నెలాఖరు వరకు మాత్రమే జీసీసీ రైతుల నుంచి తక్కువ కాఫీ గింజలను కొనుగోలు చేసిందన్నారు. ఫిబ్రవరి నుంచి కాఫీ గింజల కొనుగోలును నిలిపివేసిందన్నారు.
కోనసీమ: రామచంద్రపురం పురపాలక సంఘం ఛైర్ పర్సన్ గాదంశెట్టి శ్రీదేవి ఆధ్వర్యంలోని పాలకవర్గ పదవీకాలం నేటితో ముగియనుంది. ఈ సందర్భంగా మున్సిపల్ అత్యవసర సమావేశం నిర్వహించనున్నట్లు కమిషనర్ రాజు ఒక ప్రకటనలో తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పాల్గొని పాలకవర్గ సభ్యులను ఘనంగా సన్మానించి, అభినందించనున్నారు.
PPM: జిల్లాలోని అటవీ ప్రాంతాల్లో పెండింగ్‌లో ఉన్న రహదారులు, భవన నిర్మాణ పనులకు సంబంధించి అటవీ శాఖ అభ్యంతరాలను నిబంధనల ప్రకారం వెంటనే పరిష్కరించి, పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ డా. ప్రభాకరరెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టర్ ఛాంబర్‌లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సమావేశంలో జె.సి పాల్గొన్నారు.
NTR: వీరులపాడు మండలంలో పోగొట్టుకున్న రెండు మొబైల్ ఫోన్లను పోలీసులు విజయవంతంగా రికవరీ చేశారు. పెద్దాపురానికి చెందిన ఎస్కే మేరాబీ, జుజ్జూరుకు చెందిన జల్లి సంగీతరావు తమ ఫోన్లు పోయినట్లు CEIR పోర్టల్‌లో ఫిర్యాదు చేశారు. సాంకేతిక పరిజ్ఞానంతో ఫోన్లను గుర్తించిన ఎస్సై అభిమన్యు, సోమవారం బాధితులను పిలిపించి స్టేషన్‌లో ఫోన్లను అందజేశారు.
అన్నమయ్య: సాగునీటి వ్యవస్థ మెరుగుదలకు ఫీడర్, సప్లై చానళ్లలో డీసిల్టింగ్ పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో జరిగిన సమీక్ష సమావేశంలో జిల్లాలో గుర్తించిన 30కి పైగా పనులను త్వరగా పూర్తి చేయాలని సూచించారు. అలాగే మదనపల్లి- పీలేరు, రాయచోటి బైపాస్, మదనపల్లి-బెంగళూరు జాతీయ రహదారుల పనులు వేగవంతం చేయాలని తెలిపారు.
W.G: యర్రంశెట్టివారిపాలెం గ్రామ సర్పంచ్ యర్రంశెట్టి ముత్యమాంబ బాబుల పదవీకాలం ముగిసిన సందర్భంగా సోమవారం గ్రామస్థులు వారిని ఘనంగా సన్మానించారు. ఐదేళ్ల కాలంలో గ్రామంలో చేపట్టిన అభివృద్ధి పనులకు గుర్తుగా గ్రామస్థులు, పంచాయతీ పాలకవర్గం ఈ ఆత్మీయ వీడ్కోలు కార్యక్రమాన్ని ఒక వేడుకలా నిర్వహించారు. గ్రామస్థుల సహకారంతో పంచాయతీలో ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టామన్నారు.
ASR: ఆదివాసీ ఉద్యమకారులు 36 మందిపై గత వైసీపీ ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసులను పాడేరు ప్రథమశ్రేణి జ్యూడీషియల్ కోర్టు కొట్టివేస్తూ తీర్పు ఇచ్చినట్లు గిరిజనసంఘం జాతీయ కార్యవర్గ సభ్యుడు పీ.అప్పలనర్స సోమవారం తెలిపారు. 2021లో జీవో నెంబర్-3 చట్టబద్ధం చేయాలని కోరుతూ చేపట్టిన బంద్‌తో ప్రజలకు ఇబ్బంది కలిగించారనే ఆరోపణలతో వైసీపీ ప్రభుత్వం తప్పుడు కేసు పెట్టిందన్నారు.
KDP: జిల్లాలో గ్యాస్ సరఫరాపై సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని జేసీ మీనా తెలిపారు. జిల్లాలో గ్యాస్ సరఫరా సాధారణంగా కొనసాగుతోందని, వినియోగదారులకు సరిపడా ఎల్‌పీజీ నిల్వలు ఉన్నాయని చెప్పారు. అవసరానికి మించి సిలిండర్లు నిల్వ చేయవద్దని, గృహ వినియోగ సిలిండర్లను వాణిజ్య అవసరాలకు ఉపయోగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
NDL: రాష్ట్ర మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి మంగళవారం సాయంత్రం 4:00 గంటలకు బనగానపల్లె మండలం పరిధిలోని పెద్దరాజుపాలెం, చెర్లకొత్తూరు గ్రామాలలో నిర్వహించబడనున్న పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవ కార్యక్రమాలలో పాల్గొననున్నారు. ఈ పర్యటన వివరాలను మంత్రి క్యాంప్ కార్యాలయ అధికారులు ఒక ప్రకటన ద్వారా తెలియజేశారు.