శ్రీకాకుళం రూరల్ మండలం మడపాం వంతెన ఇసుక ర్యాంప్ వద్ద 2 కేజీల గంజాయితో బగ్గు నవీన్, అమర్నాయక్ అనే ఇద్దరు వ్యక్తులను పోలీసులు బుధవారం అదుపులోకి తీసుకున్నారు. రూరల్ ఎస్సై రాము కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గంజాయి, మత్తు పదార్థాలు నిల్వ , రవాణా చేసిన చట్టపరమైన చర్యలు ఉంటాయని ఎస్సై హెచ్చరించారు.
W.G: భీమవరం కొత్త బస్టాండ్ ఆవరణలో ఆర్టీసీ ఆధ్వర్యంలో ‘దివ్యాంగ శక్తి’ పథకం కింద దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కలెక్టర్ నాగరాణి, ఎమ్మెల్యే రామాంజనేయులు బుధవారం ప్రారంభించారు. ఈ సందర్బంగా కలెక్టర్ దివ్యాంగులతో ముచ్చటించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మానవీయత చాటుతూ వారితో కలిసి కలెక్టర్ భోజనం చేశారు.
ATP: గుంతకల్లు కసాపురం శ్రీ నెట్టికంటి ఆంజనేయస్వామి ఆలయంలో గురువారం పరాభవ నామ ఉగాది మహోత్సవాలు భక్తిశ్రద్ధలతో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆలయంలో బాలలయ ఆంజనేయస్వామికి విశేష పూజలు నిర్వహించారు. భక్తుల పెద్ద సంఖ్యలో స్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయంలో సాయంకాలం ఉగాది పండుగ సందర్భంగా పంచాంగ శ్రవణం చేస్తారని ఆలయ ఈవో విజయ రాజు తెలిపారు.
VZM: ఉగాది 2026 సంవత్సరానికి పోలీసు శాఖలో విశిష్టమైన సేవలు అందించిన పోలీసు అధికారులకు, సిబ్బందికి రాష్ట్ర ప్రభుత్వం సేవ పతాకాలను ప్రకటించిందని జిల్లా ఎస్పీ బుధవారం తెలిపారు. ఇందులో భాగంగా జిల్లా పోలీసు శాఖలో పనిచేస్తున్న 8 మంది పోలీసు అధికారులకు, సిబ్బందికి ఉత్తమ సేవ పతాకాలను మంజూరు చేశారని చెప్పారు. ఈ సందర్భంగా పతకాలు పొందిన సిబ్బంది ఎస్పీని కలిశారు.
KDP: కమలాపురం మాజీ MLA వీరశివారెడ్డి BJPలో చేరుతున్నట్లు పదేపదే ప్రకటిస్తున్నా, క్షేత్రస్థాయిలో ముహూర్తం ఖరారు కాలేదు. మాజీ CM కిరణ్ కుమార్ రెడ్డి, MP CM రమేశ్ మద్దతు తనకు ఉందని ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలోని కొందరు నేతలు ఆయన చేరికను అడ్డుకుంటున్నట్లు సమాచారం. దీంతో వీరశివారెడ్డి కమలం గూటికి చేరడం సాధ్యమవుతుందో లేదోనని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది.
VZM: తెలుగు సంవత్సరాది పురస్కరించుకుని గజపతినగరంలో గురువారం ఉదయం పార్వతి పరమేశ్వరుల పల్లకి సేవ కార్యక్రమం వైభవంగా జరిగింది. గజపతినగరం మండలంలోని పురిటిపెంట సరాబుల కాలనీలో గల మల్లికార్జున స్వామి ఆలయం అర్చకులు మణికంఠ పర్యవేక్షణలో పార్వతి పరమేశ్వరుల ఊరేగింపు కార్యక్రమం జరిగింది. ఊరేగింపుకు ముందుగా మహిళలు దీపాలను చేత పట్టుకొని ఊరేగింపులో పాల్గొన్నారు.
అన్నమయ్య: రాయలసీమ కవులు, కళాకారులకు ఉగాది పురస్కారాల్లో తీవ్ర అన్యాయం జరిగిందని డా. తవ్వా వెంకటయ్య బుధవారం ఒక ప్రకటనలో విమర్శించారు. 2026 ఉగాది అవార్డుల్లో కోస్తాంధ్రకు అధిక ప్రాధాన్యం ఇవ్వడం పక్షపాతానికి నిదర్శనమని, కడప ఉమ్మడి జిల్లాలో ఒక్కరికి కూడా అవకాశం లేకపోవడంపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
NDL: శ్రీశైల క్షేత్రంలో ఉగాది మహోత్సవాలు మూడో రోజు అంగరంగ వైభవంగా జరిగాయి. స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహించగా, క్షేత్రం భక్తులతో కిక్కిరిసింది. సాయంత్రం నందివాహనంపై స్వామి అమ్మవార్ల గ్రామోత్సవం అట్టహాసంగా జరిగింది, దీనికి భక్తులు భారీగా తరలివచ్చారు. మహాసరస్వతి అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు.
తూ.గో: రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గంలోని కొంతమూరు మసీదులో బుధవారం నిర్వహించిన ఇఫ్తార్ విందులో మంత్రి దుర్గేశ్ పాల్గొన్నారు. పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా ముస్లింలతో కలిసి ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఉపవాస దీక్షను ముగించుకునే ఈ ఆధ్యాత్మిక సందర్భాన్ని పంచుకోవడం ఎంతో ఆనందంగా, అనిపించిందని, సోదరభావం, సహనశీలత, పరస్పర గౌరవానికి ప్రతీకగా రంజాన్ ప్రతీక అన్నారు.
మార్కాపురం జిల్లా తర్లుపాడు రైల్వే గేట్ సమీపంలో గుంటూరు-తిరుపతి ట్రైన్ బుధవారం రాత్రి అకస్మాత్తుగా ఆగింది. చక్రాల రాపిడితో S7 బోగి వద్ద పొగలు వచ్చాయి. అప్రమత్తమైన సిబ్బంది వెంటనే ట్రైన్‌ను నిలిపివేశారు. ప్రయాణికుల భద్రత దృష్ట్యా సాంకేతిక సిబ్బంది తనిఖీలు చేపట్టారు. ఎటువంటి ప్రమాదం జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు.
SKLM: పోలాకి మండలం మబగాంలో పరాభవ నామ సంవత్సరం పురస్కరించుకుని బుధవారం రాత్రి నిర్వహించిన పంచాంగ శ్రవణంలో వైసీపీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృ ష్ణదాస్ పాల్గొన్నారు. నూతన సంవత్సరంలో వ్యవసాయం, అనుబంధ రంగాల్లో రాబోయే మార్పులు, వాతావరణం, రాజకీయ, సామాజిక అంశాలపై శృంగవరపు లక్ష్మీ ధనుంజయశర్మ పంచాగ పఠనంలో తెలియజేశారు. అనంతరం జిల్లా ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు.
KRNL: నందవరం మండలం నది కైరవాడి గ్రామానికి చెందిన యువ రైతు వడ్రంగి రామాచారి (35) గుండెపోటుతో మృతి చెందారు. ఆదివారం ఛాతీలో తీవ్ర నొప్పి రావడంతో కుటుంబసభ్యులు ఆయనను కర్నూల్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందారు. మృతుడికి భార్య మల్లేశ్వరి, ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
కాకినాడ: కొత్తపల్లి మండలంలో మంచినీరు లేక మూడు గ్రామాల ప్రజలు మూడు రోజులుగా ఇబ్బందులు పడుతున్నారు. చిన్న కలవల దొడ్డి, వెంకటరాయపురం, పెద్ద కలవల దొడ్డి గ్రామాల ప్రజలు మంచినీటి కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. మంచినీటి పైపులైన్ ధ్వంసం కావడంతో మంచినీరు రావడంలేదని ఆ గ్రామాల ప్రజలు వాపోతున్నారు. అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలన్నారు.
CTR: జిల్లాలో దివ్యాంగుల వికలత్వం గుర్తించడానికి స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు సచివాలయాల్లో ‘సదరం’ స్లాట్ బుకింగ్‌లు ప్రభుత్వం అనుమతిచ్చిందని అధికారులు తెలిపారు. ప్రతి సోమ, మంగళవారం కార్యక్రమం ఉంటుందన్నారు. మార్చి నుంచి మే వరకు తొలి త్రైమాసికానికి సంబంధించి స్లాట్ల బుకింగ్ జరుగుతాయన్నారు.
ELR: జంగారెడ్డిగూడెం గ్రామదేవత గంగానమ్మ అమ్మవారి ఆలయంలో బుధవారం పరాభావ నామ సంవత్సర ఉగాది పండుగ శోభ సంతరించుకుంది. ఈ సందర్భంగా అమ్మవారు ప్రత్యేక అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. అలాగే అమ్మవారికి విశేష పూజా కైంకర్యాలను ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా జరిపించారు. అనంతరం భక్తులు అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు.