ప్రకాశం: టంగుటూరు మండలం తూర్పు నాయుడుపాలెం జాతీయ రహదారి ఫ్లైఓవర్ బ్రిడ్జిపై మంగళవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. నెల్లూరు వైపు వెళ్తున్న కర్రల లారీని వెనక నుంచి కారు ఢీ కొట్టి, డివైడర్‌కు తగిలింది. ఈ ప్రమాదంలో కారు డ్రైవర్ అబ్దుల్ మానేన్ అనే యువకుడు మృతి చెందాడు. మృతుడు ఎన్టీఆర్ జిల్లా మైలవరం గ్రామానికి చెందిన వ్యక్తి. మృతదేహాన్ని రిమ్స్ హాస్పిటల్‌కి తరలించారు.
ATP: యాడికి మండల కేంద్రంలో శ్రీ శివలక్ష్మీ చెన్నకేశవస్వామి బ్రహ్మరథోత్సవం కన్నుల పండువగా సాగింది. గోవింద నామస్మరణతో పురవీధులు మార్మోగగా, వేలాదిమంది భక్తుల నడుమ రథం కదిలింది. రథం ముందు హోమం, ప్రత్యేక పూజలు నిర్వహించి ఉత్సవాన్ని ప్రారంభించారు. స్వామి వారి రథాన్ని లాగేందుకు భక్తులు పెద్ద ఎత్తున బారులు తీరారు.
VZM: బొబ్బిలి పట్టణంలోని నాయుడు కాలనీకి చెందిన కె. భానుప్రకాశ్ మొదటి ప్రయత్నంలో 4 బ్యాంకు ఉద్యోగాలు సాధించారు. తాడేపల్లిగూడెంలో ఎన్.ఐ.టీ పూర్తి చేసి రిలీవ్ అయిన నాలుగు నెలల్లో మొదటి ప్రయత్నంలోనే 4 ఉద్యోగాలు సాధించడంతో కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
CTR: చంద్రగ్రహణం కారణంగా మంగళవారం పుంగనూరు పట్టణంలోని శ్రీ కళ్యాణ వెంకటరమణ స్వామి వారి ఆలయం టెంపుల్ ఇన్‌స్పెక్టర్ కృష్ణమూర్తి సమక్షంలో మూసివేశారు. గ్రహణం వీడిన తర్వాత ఇవాళ సాయంత్రం 7 గంటలకు ఆలయాన్ని శుద్ధి చేసి యథావిధిగా శ్రీవారికి పూజారి కైంకర్యాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. అలాగే పట్టణంలోని వివిధ ఆలయాలను మూసి వేశారు.
NDL: బేతంచెర్లలోని శ్రీ మద్దిలేటి నరసింహ స్వామి ఆలయంలో మంగళవారం ప్రాతఃకాలంలో స్వామి, అమ్మవార్లకు సుప్రభాతం, అభిషేకం, నైవేద్యం, మంత్ర పుష్పాలు సమర్పించారు. చంద్ర గ్రహణం పురస్కరించి ఉభయ దేవాలయ మూర్తులకు దర్భకూర్చలు ఇవ్వగా, ఉపకమిషనర్ రామాంజనేయుల ఆధ్వర్యంలో అర్చకుల సమక్షంలో ఆలయ ద్వారాలు మూసివేశారు.
E.G: సీతానగరం మండలం బొబ్బిలంకలో సోమవారం దారుణ ఘటన చోటుచేసుకుంది. చోడదాసి సీతారామరాజు తన మొదటి భార్య లత (30), అత్త గుమ్మడి లక్ష్మి(50)ని కత్తితో నరికి హత్య చేశాడు. అనంతరం కత్తిని గోదావరిలో పడేసి సీతానగరం పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. 16 ఏళ్ల క్రితం వివాహమైన వీరికి ముగ్గురు పిల్లలున్నారు. కాగా, గొడవలతో విడిపోయిన వీరు ఒకే వీధిలో ఉంటున్నట్లు స్థానికులు తెలిపారు.
W.G: తాడేపల్లిగూడెం 31, 32వ వార్డులకు చెందిన 40 మంది సోమవారం సాయంత్రం వైసీపీ నాయకుడు శీలి వెంకటేశ్వరరావు, శీలి మేరీ కుమారి ఆధ్వర్యంలో జనసేనలో చేరారు. వారికి ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ పార్టీ కండువా వేసి ఆహ్వానించారు. దళితుల అభ్యున్నతే జనసేన లక్ష్యమని తెలిపారు. పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేయాలని వారికి సూచించారు.
ASR: ముంచంగిపుట్టులో నిన్న అర్ధరాత్రి దారుణ ఘటన చోటుచేసుకుంది. గుర్తు తెలియని వ్యక్తులు ఓ గిరిజనుడిని పీక కోసి హత్య చేశారు. మృతుడు పెదబయలు మండలం అరడకోట గ్రామానికి చెందిన కుర్తాడి నాగేశ్వరరావుగా గుర్తించారు. ఆయన కొండపడలో జరుగుతున్న హోలీ జాతర పండుగను వీక్షించేందుకు వచ్చి ఉండగా, అర్ధరాత్రి సమయంలో మండల కేంద్రంలోని ఏటీఎం సమీపంలో ఈ ఘటన జరిగినట్లు సమాచారం.
GNTR: పొన్నూరు పట్టణంలో మంగళవారం నిషేధిత సట్కా మట్కా జూదం బహిరంగంగా కొనసాగుతోంది. ముబారక్ నగర్, గణేష్ భవన్ రోడ్డు, బాపట్ల బస్టాండ్, మార్కెట్ సెంటర్ ప్రాంతాల్లో మట్కా నిర్వహిస్తున్నారు. రూ.10కు రూ.800 ఆశ చూపుతూ సామాన్యులను ఆకర్షిస్తున్నారని విమర్శలు ఉన్నాయి. పోలీసుల నియంత్రణ లేకపోవడంతో ప్రజలు కఠిన చర్యలు కోరుతున్నారు.
SKLM: నరసన్నపేట నియోజకవర్గ ప్రజలకు ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి హోలీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. హోలీను సురక్షితంగా జరుపుకోవాలని సూచించారు. హానికరమైన రసాయన రంగులను ఉపయోగించవద్దని, సహజ రంగులను మాత్రమే వాడాలని కోరారు.
AKB: నర్సీపట్నం మున్సిపాలిటీ బలిఘట్టం ఉత్తర్వాహిని వద్ద ఉన్న పాకలపాడు గురుదేవుల ఆశ్రమంలో పౌర్ణమి పూజలు మంగళవారం ఘనంగా జరిగాయి. వేదమంత్రాల నడుమ జరిగిన కార్యక్రమం ఆధ్యాత్మిక వాతావరణాన్ని నెలకొల్పింది. అనంతరం భక్తులకు ప్రసాదం పంపిణీ చేశారు. పౌర్ణమి సందర్భంగా ఆశ్రమం భక్తులతో కిటకిటలాడింది.
NLR: ఉదయగిరి, వరికుంటపాడు మండలాల సరిహద్దులోని గండిపాళెం గ్రామంలోని పెట్రోలు బంకు నెల రోజులుగా పనిచేయడం లేదు. దీంతో స్థానిక వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఇంధనం కోసం ఉదయగిరి, వరికుంటపాడు, పామూరు పట్టణాలకు వెళ్లాల్సి వస్తోందని వారు వాపోతున్నారు. అధికారులు వెంటనే స్పందించి బంకు నిరంతరాయంగా పనిచేసేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
PPM: పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద మంగళవారం స్దానిక ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర ఆధ్వర్యంలో హోలీ సంబరాలను ఉత్సాహంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి రంగులు జల్లుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రజలు అందరూ ఐక్యత, స్నేహ భావంతో ముందుకు సాగాలని ఆకాంక్షించారు.
SKLM: జిల్లాలో ఈ నెల 5న వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్ నిర్వహించనున్నట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తెలిపారు. కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ సౌజన్యంతో అంబేద్కర్ విశ్వవిద్యాలయం NSS యూనిట్, మేరా యువ భారత్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. నిన్న జిల్లా జడ్పీ కార్యాలయ సమావేశ మందిరంలో ఈ కార్యక్రమానికి సంబంధించిన గోడ ప్రతులు ఆవిష్కరించారు.