TPT: నాగలాపురం మండలం సురుటపల్లి గ్రామంలోని శ్రీ పల్లి కొండేశ్వర స్వామి దేవస్థానం నందు హుండీలు, నిత్య అన్నదానం హుండీల ద్వారా రూ. 12,70,408 ఆదాయం వచ్చినట్లు ఆలయ నిర్వహణ అధికారి పి. లత తెలిపారు. తిరుపతి డివిజన్ దేవాదాయ శాఖ తనిఖీదారులు పి. పని రాజశయన పర్యవేక్షణలో, హుండీ లెక్కింపు కార్యక్రమం జరిగింది.
నెల్లూరు జిల్లాలోని అసెంబ్లీ నియోజకవర్గాలకు వైసీపీ పరిశీలకులను నియమిస్తూ ఆ పార్టీ కేంద్ర కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో నెల్లూరు సిటీకి కొండ్రెడ్డి రంగారెడ్డి, నెల్లూరు రూరల్‌కు చిల్లకూరు సుధీర్ రెడ్డి, కోవూరు కొండూరు అనిల్, ఆత్మకూరు పేర్నాటి కోటేశ్వర రెడ్డి, కావలికి కొడవలూరు ధనుంజయరెడ్డి, గూడూరుకు బీరేంద్ర వర్మలను నియమించారు.
సత్యసాయి: పుట్టపర్తి పరిధిలోని కర్ణాటక నాగేపల్లి అటవీ ప్రాంతంలో పేకాట ఆడుతున్న స్థావరాలపై పోలీసులు మెరుపు దాడి నిర్వహించారు. పక్కా సమాచారంతో వెళ్లిన పోలీసులు ఏడుగురిని అరెస్టు చేసి, వారి నుంచి రూ.8,000 నగదును స్వాధీనం చేసుకున్నారు. పుట్టపర్తి రూరల్ పరిధిలో అసాంఘిక కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై క్రాంతి కుమార్ హెచ్చరించారు.
ASR: కొయ్యూరు మండలంలోని కాకరపాడు గురుకుల జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ లక్షణుడు, డిప్యూటీ వార్డెన్ ఏ.లీలావతిని గురుకులం కార్యదర్శి సస్పెండ్ చేసినట్లు ATWO క్రాంతికుమార్ ఇవాళ తెలిపారు. కళాశాలలో ఏఎన్ఎంకు డిప్యూటీ వార్డెన్‌గా బాధ్యతలను అప్పగించడంతో పాటు, సరుకులు బయటకు వెళుతున్నాయని ఆరోపణలు వచ్చాయి. దీనిపై విచారణ జరిపి సస్పెండ్ చేసినట్లు సమాచారం.
కాకినాడ GGHలో సెక్యూరిటీ గార్డుల దౌర్జన్యం శృతిమించింది. శుక్రవారం గార్డులు 2వర్గాలుగా విడిపోయి బాహాబాహీకి దిగడంతో పలువురు గాయపడి ఆసుపత్రి పాలయ్యారు. వీరి ఆగడాలపై సూపరింటెండెంట్‌కు ఫిర్యాదు చేసినా ఫలితం లేదని బాధితులు వాపోతున్నారు. ఆసుపత్రి ఛైర్మన్ హోదాలో కలెక్టర్ తక్షణమే స్పందించి, సెక్యూరిటీ సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
E.G: నల్లజర్ల మండలం అనంతపల్లి జాతీయ రహదారిపై శుక్రవారం రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంతో వెళ్తున్న వ్యాన్ ఒక్కసారిగా బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. అందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. క్షతగాత్రులను 108 వాహనంలో ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతున్నారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు.
ATP: గుత్తి మున్సిపాలిటీ కార్యాలయం సమీపంలో శుక్రవారం పారిశుద్ధ్య కార్మికుల సమస్యల పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సామూహిక దీక్షలు చేపట్టారు. పారిశుద్ధ్య కార్మిక సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ, రామంజి మాట్లాడుతూ.. సమాన పనికి సమానవేతనం ఇవ్వాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. రెండు రోజులపాటు ఈ సామూహిక దీక్షలు జరుగుతాయన్నారు.
PPM: కొమరాడ మండలంలోని జంజావతి, తోటపల్లి, వనకాబడి, గుమ్మిడిగడ్డ ప్రాజెక్టులకు బడ్జెట్‌లో పూర్తిస్థాయిలో నిధులు కేటాయించి పనులు పూర్తి చేయాలని రైతు నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఇవాళ మండల కేంద్రంలో రైతు సంఘం నాయకులు కరపత్రాలను విడుదల చేసారు. ఈనెల 9న కలెక్టర్ కార్యాలయం వద్ద జరిగే ధర్నాకు పెద్ద ఎత్తున రైతులు పాల్గొని విజయవంతం చేయాలని రైతులు పిలుపునిచ్చారు.
Akp: జిల్లా వైసీపీ యువజన విభాగం జనరల్ సెక్రటరీగా గొలుగొండ మండలం చిన్నయ్యపాలెం గ్రామానికి చెందిన పెనుమత్స శివరాజును నియమించారు. వైసీపీ అధినేత జగన్ ఆదేశాలతో నర్సీపట్నం మాజీ ఎమ్మెల్యే ఉమా శంకర్ గణేష్ ప్రతిపాదన మేరకు ఈయన నియమిస్తూ వైసీపీ కేంద్ర కార్యాలయం నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. తనకు అప్పగించిన ఈ బాధ్యతలకు న్యాయం చేస్తానని అన్నారు.
అన్నమయ్య: నిమ్మనపల్లి మండలం గొల్లపల్లె సమీపంలోని పెద్దకొండపై గురువారం గుర్తుతెలియని వ్యక్తులు పెట్టిన మంటలను ఆర్పేందుకు వెళ్లిన FBO హరిశంకరరెడ్డి వడదెబ్బకు గురై అస్వస్థతకు లోనయ్యారు. మంటలు ఆర్పే క్రమంలో ఆయన దారితప్పి అడవిలోనే చిక్కుకుపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు, ఫారెస్ట్ అధికారులు ఫోన్ లొకేషన్ ఆధారంగా ఆయన ఆచూకీ గుర్తించి, చాకచక్యంగా కొండ కిందకు దించారు.
VSP: మాధవధార బిర్లా జంక్షన్ వద్ద గుర్తుతెలియని వ్యక్తి ఏటీఎంను పగలగొట్టాడు. అదే సమయంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని కూడా స్వల్పంగా ధ్వంసం చేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడిని గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ఘటనతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు.
KRNL: సి. బెళగల్ మండలం కొండాపురం గ్రామంలో గురువారం ఇరువర్గాల యువకుల మధ్య ఘర్షణతో ఉద్రిక్తత నెలకొంది. క్రికెట్ పోటీల విషయంలో రెండు రోజుల క్రితం వాగ్వాదం జరగడంతో, యువకులు బంధుమిత్రులతో కలిసి దాడులకు సిద్ధమయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు గ్రామానికి చేరుకుని ఇరువర్గాలను చెదరగొట్టారు. పెద్దలు, పోలీసుల జోక్యంతో పరిస్థితి సద్దుమణిగింది.
AKP: అంతర్జాతీయ మహిళా దినోత్సవ వారోత్సవాలు పురస్కరించుకుని నర్సీపట్నం డిఎస్పీ కార్యాలయంలో ఇవాళ మెగా రక్తదాన శిబిరం, ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ పోతిరెడ్డి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. ఈ శిబిరంలో పాల్గొన్న సీఐలు, ఎస్సైలు, పోలీస్ సిబ్బంది రక్తం దానం చేసి మానవత్వాన్ని చాటుకున్నారు.
VZM: కేంద్ర ప్రభుత్వం చేపట్టనున్న 16వ జనాభా గణనను జిల్లాలో సమర్థవంతంగా నిర్వహించేందుకు అధికారులు సిద్ధం కావాలని జిల్లా కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి సూచించారు. చింతలవలసలోని ఎం.వీ.జీ.ఆర్ ఇంజినీరింగ్ కళాశాలలో జరుగుతున్న ‘గృహాల జాబితా, గృహ వసతుల గణన’ శిక్షణ కార్యక్రమాన్ని ఆయన పరిశీలించారు. జనగణన డేటా సేకరణపై పూర్తి అవగాహనతో పనిచేయాలని సూచించారు.
SKLM: నరసన్నపేట మండలం కంబకాయ జంక్షన్ వద్ద రోడ్డు అద్వానంగా తయారయిందని స్థానికులు, వాహనదారులు అంటున్నారు. ఎక్కడికక్కడ రోడ్డంతా గుంతల గుంతలుగా ఉండడంతో తరచూ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని వాహనదారులు వాపోతున్నారు. చాలా ఏళ్లుగా రోడ్లు మరమ్మత్తులు చేపట్టకపోవడంతో అధ్వానంగా ఉందన్నారు. సంబంధిత అధికారులు స్పందించాలని కోరుతున్నారు.