• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

విజయనగరం ఆర్డీవో బదిలీ..?

VZM: 2018 గ్రూప్-1 అధికారులపై వచ్చిన ఆరోపణలపై రాష్ట్ర వ్యాప్తంగా 26 మంది ఆర్డీలోలు బదిలీ అయిన సంగతి తెలిసిందే. వారిని అప్రాధాన్యత పోస్టుల్లో ఉంచాలని హైకోర్టు ఇప్పటికే ఆదేశించింది. తక్షణ చర్యలు తీసుకోకపోవడంతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ బుధవారం కోర్టుకు కూడా హాజరుకావాల్సి వచ్చింది. వారిలో విజయనగరం ఆర్డీవో దాట్ల కీర్తి కూడా ఉన్నారు.

February 25, 2026 / 09:35 PM IST

ఈడుపుగల్లులో కలెక్టర్ పర్యటన

కృష్ణా: కలెక్టర్ బాలాజీ కంకిపాడు(M)లోని ఈడుపుగల్లులో నిర్మాణంలో ఉన్న తారురోడ్డును బుధవారం ఆకస్మికంగా పరిశీలించారు. రోడ్డుపై వెళ్తున్న వాహనదారులను ఆపి నిర్మాణ నాణ్యత, గతంలో ఎదురైన ఇబ్బందులపై అభిప్రాయాలు తెలుసుకున్నారు. పనుల పురోగతిపై కలెక్టర్ సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కంకిపాడు మండలంకు చెందిన ఆర్‌అండ్‌బీ డీఈఈ బలరాం పాల్గొన్నారు.

February 25, 2026 / 09:32 PM IST

గంజాయి నియంత్రణలో ప్రభుత్వం విఫలం: సీపీఐ

GNTR: డ్రగ్స్ మాఫియా, కార్పొరేట్ వైద్య దోపిడీపై కఠిన చర్యలు తీసుకోవాలని సీపీఐ జాతీయ నేత నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. బుధవారం గుంటూరులో జరిగిన పార్టీ జిల్లా కౌన్సిల్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఈనెల 28న డ్రగ్ మాఫియాకు వ్యతిరేకంగా నిర్వహించే నిరసనలో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరారు. ప్రభుత్వం గంజాయి, కల్తీ ఆహారం నియంత్రించడంలో విఫలమైందన్నారు.

February 25, 2026 / 09:30 PM IST

బౌలింగ్ చేసిన మంత్రి సత్యకుమార్ యాదవ్

సత్యసాయి: అమరావతిలో జరుగుతున్న శాసనసభ్యుల క్రీడా పోటీల్లో రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ సందడి చేశారు. బుధవారం నిర్వహించిన క్రికెట్ మ్యాచ్‌లో ఆయన పాల్గొని ఉత్సాహంగా బౌలింగ్ చేశారు. అనంతరం బ్యాట్ తోనూ అలరించారు. వృత్తిపరమైన ఒత్తిడి నుంచి ఉపశమనం పొందేందుకు ఇలాంటి క్రీడలు ఎంతో దోహదపడతాయని మంత్రి పేర్కొన్నారు.

February 25, 2026 / 09:13 PM IST

గిరిజన ప్రాంతాల్లో తాగునీటి సమస్యను పరిష్కరించండి: కలెక్టర్

PLD: గిరిజన తండాల్లో తాగునీటి సమస్య పరిష్కారానికి చర్యలు వేగవంతం చేయాలని పల్నాడు కలెక్టర్ కృతిక శుక్లా అధికారులను ఆదేశించారు. జల్ జీవన్ మిషన్ కింద 6 మండలాల్లోని 22 తండాలకు పైపులైన్లు, రహదారుల నిర్మాణానికి అటవీ శాఖ తక్షణమే అనుమతులు ఇవ్వాలని సూచించారు. క్యాంపు కార్యాలయం నుండి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో మౌలిక వసతుల కల్పనపై ఆమె దిశానిర్దేశం చేశారు.

February 25, 2026 / 09:00 PM IST

కన్నంపాలెంలో రహదారి పనుల తనిఖీ

AKP: చోడవరం మండలం కన్నంపాలెంలో ఉపాధి నిధులతో నిర్మించనున్న రహదారి నిర్మాణానికి సంబంధించిన సామగ్రిని ఎంపీడీవో సీతారామస్వామి బుధవారం తనిఖీ చేశారు. గ్రామంలో కల్లా వారి పొలాల నుంచి స్మశానం వరకు సిమెంట్ రోడ్డు నిర్మాణానికి ఉపాధి హామీ పథకం కింద రూ.10 లక్షలు మంజూరయ్యాయి. పనుల్లో నాణ్యత ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలని సిబ్బందికి సూచించారు.

February 25, 2026 / 08:54 PM IST

‘కేంద్రం దృష్టికి సమస్యను తీసుకెళ్తాం’

NLR: చౌక ధరల దుకాణ దారుల డీలర్లు తమ సమస్యలు పరిష్కరించేలా చూడాలని ఆ సంఘం సంక్షేమ సమాఖ్య సభ్యులు నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డికి విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం కమిషన్‌ నెలకు రూ. 6 వేల నుంచి 8 వేల వరకు మాత్రమే అందుతుందన్నారు. రూ. 35 వేలు ఆదాయం వచ్చేలా, డీలర్ల కుటుంబానికి ఆరోగ్య కార్డులను అందించేలా కేంద్ర దృష్టికి తీసుకెళ్తామన్నారు.

February 25, 2026 / 08:54 PM IST

మసీదులకు కూలర్లు అందజేసిన ఎమ్మెల్యే

NLR: పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా ఉపవాస దీక్షలు చేపట్టే ముస్లిం సోదరుల సౌకర్యార్థం ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి వాటర్ కూలర్ల వితరణ చేశారు. బుచ్చిరెడ్డి పాళెం మండలంలోని దామరమడుగు, పెనుబల్లి వవ్వేరు, చెల్లాయపాలెం, పంచేడు గ్రామాలలోని 5 మసీదు కమిటీ సభ్యులకు వీటిని అందజేశారు. మసీదులోకి వచ్చే ముస్లింల సౌకర్యార్థం కూలర్లను ఇచ్చినట్లు ఆమె తెలిపారు.

February 25, 2026 / 08:51 PM IST

డ్రోన్ నిఘాతో కడపలో స్పెషల్ డ్రైవ్

KDP: గంజాయి, నిషేధిత మత్తు పదార్థాల వినియోగం, బహిరంగ మద్యపానం, అసాంఘిక కార్యకలాపాలపై పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. జిల్లా ఎస్పీ విశ్వనాథ్ ఆదేశాల మేరకు స్పెషల్ పార్టీలతో పాటు డ్రోన్ కెమెరాల ద్వారా అనుమానిత ప్రాంతాల్లో నిఘా పెంచారు. నిందితులను గుర్తించి కౌన్సిలింగ్, చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నట్లు డీఎస్పీ వెంకటేశ్వర్లు తెలిపారు.

February 25, 2026 / 08:48 PM IST

అందుబాటులోకి ఫోమెబెస్ట్ యాంటీడోట్ ఇంజెక్షన్..!

E.G: కలుషిత పాలు కారణంగా వైద్య సహాయం అవసరమయ్యే రోగులకు ఫోమెబెస్ట్ యాంటీడోట్ అందించడం కోసం ముంబై నుండి ప్రత్యేకంగా తీసుకువస్తున్నారని కలెక్టర్ కీర్తి చేకూరి బుధవారం వెల్లడించారు. రోగి ఆరోగ్య పరిస్థితిని బట్టి ఈ ఇంజెక్షన్ ఉపయోగించవచ్చని చెప్పారు. ఈ మందు అంతర్జాతీయ స్థాయిలో సంప్రదించి ఏజెన్సీల ద్వారా తీసుకువస్తున్నామన్నారు.

February 25, 2026 / 08:46 PM IST

మండపేటలో భారీ వర్షం

కోనసీమ: మండపేటలో బుధవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. మండపేట, ద్వారపూడి, రూరల్ మండలం గ్రామాల్లో ఈదురు గాలులతో వర్షం పడింది. కేశవరంలో భారీ వర్షం కురిసింది. మండపేటలో వర్షం వలన డ్రైన్ లలో నీరు రోడ్‌పై ప్రవహించింది. ద్వారపూడిలో డ్రైన్‌లు మూసుకొని పోవడంతో రోడ్ మీద నీరు నిలిచిపోయింది. మండపేటలో పలు ప్రాంతాల్లో వర్షం నీరు రోడ్‌పై ప్రవహించింది.

February 25, 2026 / 08:45 PM IST

ప్రత్యేక పర్యవేక్షకులును కలిసిన కలెక్టర్

ASR: జాతీయ మానవ హక్కుల కమిషన్ ప్రత్యేక పర్యవేక్షకులు ఆర్.హేమంత్ కుమార్ బుధవారం పాడేరు వచ్చారు. పాడేరు పీఎంఆర్సీ అతిథి గృహంలో ఆయనను జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ మర్యాదపూర్వకంగా కలిశారు. పుష్పగుచ్చాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చించారు. జిల్లాలో చేపడుతున్న శాంతిభద్రతల పరిరక్షణ, అవగాహన కార్యక్రమాలపై కలెక్టర్ వివరించారు.

February 25, 2026 / 08:45 PM IST

అదుపులో డయేరియా: ఎమ్మెల్యే

SKLM: జిల్లాలో డయేరియా పరిస్థితి ప్రస్తుతం అదుపులో ఉందని స్థానిక ఎమ్మెల్యే గోండు శంకర్ తెలిపారు. బుధవారం జిల్లా టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. వైద్యశాఖ అధికారులు అప్రమత్తంగా ఉన్నారని, అవసరమైన వైద్య సిబ్బంది, ఔషధాలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని, స్వచ్ఛత పాటించాలని సూచించారు.

February 25, 2026 / 08:38 PM IST

తొడ కొట్టిన ఎమ్మెల్యే రఘురామ

W.G: మొదటి రోజు అసెంబ్లీ ‘ఆట విడుపు’ క్రీడా పోటీలలో సహచర ప్రజా ప్రతినిధులతో కలిసి శాసనసభ డిప్యూటీ స్పీకర్, ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణ రాజు బుధవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన వాలీబాల్, కబడ్డీ ఆటలను ఆడారు. అలాగే ఆటల్లో సరదాగా ఆయన తొడ కొట్టారు. క్రీడలు మానసిక ఉల్లాసానికి దోహదపడతాయని ఎమ్మెల్యే రఘురామ అన్నారు.

February 25, 2026 / 08:38 PM IST

నీటి సంపులో పడిన పశువు రక్షణ

అన్నమయ్య: పుంగనూరు టౌన్ మంగళం రోడ్డు, కోనేటిపాలెం వద్ద 15 అడుగుల లోతైన నీటి సంపులో ఓ పశువును పడిపోయింది. స్థానికుల సమాచారం మేరకు అగ్నిమాపక సిబ్బంది తాళ్లు, నిచ్చెనల సహాయంతో ఆవును రక్షించి యజమానికి అప్పగించారు. రెస్క్యూ కాల్‌పై సిబ్బంది వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్నారు. స్థానిక ప్రజల సహకారంతో రక్షణ చర్యలు విజయవంతంగా పూర్తయ్యాయి.

February 25, 2026 / 08:36 PM IST