టాలీవుడ్ లో మెగా ఫ్యామిలీకంటూ ఓ స్పెషల్ క్రేజ్ ఉంది. సినిమాల విషయం కాసేపు పక్కన పెట్టినా… మెగా బ్రదర్స్ మధ్య ఉన్న అనుబంధం ఎప్పుడూ అభిమానులను మరింత ఆకర్షిస్తూ ఉంటుంది. తాజాగా గాడ్ ఫాదర్ సినిమా నేపథ్యంలో.. పవన్ గురించీ, పవన్ పార్టీ గురించి చిరంజీవి మాట్లాడిన సంగతి తెలిసిందే.
తాను రాజకీయాలకు దూరం కావడానికి కారణాన్ని చెబుతూ.. తన సపోర్ట్ తన తమ్ముడికి ఎప్పుడూ ఉంటుందని తేల్చిచెప్పాడు. కాగా.. చిరంజీవి చెప్పిన కామెంట్స్ పై తాజాగా మెగా బ్రదర్, జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు శ్రీ కొణిదెల నాగబాబు స్పందించారు. అన్న ఆశీస్సులు ఉంటే తమ్ముడు పవన్ ఖచ్చితంగా పగ్గాలు చేపడతాడని భరోసా ఇచ్చాడు.
” మేమిద్దరం చెరో వైపు ఉండడం కంటే తాను తప్పుకోవడమే తన తమ్ముడు మరింతగా ఉద్భవించడానికి ఉపయోగకరం అవుతుందేమోననే రాజకీయాల నుంచి తప్పుకున్నాను..” అని అన్నయ్య శ్రీ చిరంజీవి గారు చాలా ఉన్నతత్వంతో చెప్పిన మాట కోట్లాది మంది తమ్ముళ్ళ మనసులు గెలుచుకుందని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు శ్రీ కొణిదెల నాగబాబు స్పష్టం చేసారు.
జనసేనాని శ్రీ పవన్ కల్యాణ్ గారి లాంటి నిబద్ధత వున్న నాయకుడు పరిపాలన పగ్గాలు చేపట్టాలనే అన్నయ్య గారి ఆకాంక్ష తప్పకుండా నెరవేరుతుందని, జన సైనికులుగా మేమంతా ఆ మహత్ కార్యాన్ని నెరవేర్చి చూపిస్తామని నాగబాబు అన్నారు. నా తమ్ముడు రాష్ట్రాన్ని ఏలే నాయకుడు కావొచ్చని, పవన్ కళ్యాణ్ నిజాయితీ, నిబద్ధత తనకు చిన్నప్పటి నుంచి తెలుసునని అన్నయ్య చెప్పిన మాటలు జన సైనికులకు, వీర మహిళలకు మనో ధైర్యాన్ని పెంపొందించాయని పేర్కొన్నారు. భవిష్యత్లో తాను ఏ పక్షాన వుంటారనేది ప్రజలు నిర్ణయిస్తారని అన్నయ్య చెప్పిన మాటలకు అనుగుణంగా జన సైనికులు, వీర మహిళలు మరింత శ్రమించి ప్రజల మన్ననలు పొందాలని నాగబాబు కోరారు.