ఆంధ్రప్రదేశ్ బీజేపీలో విబేధాలు మరింత ముదిరాయి. ఏపీ బీజేపీ మాజీ అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ, ప్రస్తుత అధ్యక్షులు సోము వీర్రాజు మధ్య విబేధాలు రోడ్డున పడ్డాయి. రెండు రోజుల క్రితం గుంటూరులో కన్నా మాట్లాడుతూ.. రాష్ట్ర అధ్యక్షుడిపై నిప్పులు చెరిగారు. దీనిపై సోము వర్గం తాజాగా స్పందించింది. అధ్యక్షుడిపై బాహాటంగా విమర్శలు చేస్తున్న కన్నాపై చర్యలు తీసుకోవాలని సోము వర్గం డిమాండ్ చేస్తోంది. ఆయన టీడీపీ, జనసేన పార్టీలతో టచ్లో ఉన్నారని, పార్టీని వీడేందుకు సిద్ధపడి ఇలా ఇష్టారీతిన మాట్లాడుతున్నారన్నారు.
పార్టీ నుండి ఆయన తనంతట తాను వెళ్లిపోకుండా, ఇష్టం వచ్చినట్లు మాట్లాడి, పార్టీ ఆయనను బయటకు పంపేలా వ్యవహరిస్తున్నారని సోము వర్గం ఆరోపిస్తోంది. అంటే తాను బయటకు వెళ్లడానికి సోము కారణమని చెప్పేలా ఆయన ప్రణాళికతో సాగుతున్నారని చెబుతున్నారు. కన్నా రెండుమూడుసార్లు విమర్శలు గుప్పించినా, తాము మాట్లాడలేదని, ఇప్పుడు మరింత ఘాటుగా విమర్శలు చేస్తున్నారని, కాబట్టి ఆయనపై చర్యలు తీసుకోవాల్సిందే అంటున్నారు. ఈ మేరకు కన్నా చేసిన ఘాటు విమర్శలను సోము వర్గం ఇంగ్లీష్, హిందీలోకి తర్జుమా చేసి పంపించింది.
కన్నా జనసేనలోకి వెళ్తారా?
కన్నా టీడీపీ, జనసేనలోకి వెళ్లేందుకే ఇలా మాట్లాడుతున్నారనేది సోము వర్గం వాదన. గతంలో టీడీపీలోకి వెళ్దామనుకున్నప్పటికీ, అది కుదరలేదని, ప్రస్తుతం అతని చూపు జనసేన వైపు కనిపిస్తోంది. ఇటీవల ఆయన చేసిన వ్యాఖ్యలు కూడా ఆసక్తికరంగా మారాయి. పార్టీ అధిష్టానం జనసేనతో కలిసి నడవాలని చెబుతుంటే, సోము మాత్రం అధికార పార్టీకి అనుకూలంగా ఉన్నారని, తాము మాత్రం ఢిల్లీ పెద్దల సూచనల మేరకు పవన్ కళ్యాణ్ వెంట నడుస్తామని చెప్పారు. ఈ వ్యాఖ్యలే ఆయన జనసేనలోకి వెళ్తారనేందుకు సంకేతాలు అంటున్నారు. కొద్ది రోజుల క్రితం ఆయన నాదెండ్ల మనోహర్తోను భేటీ అయ్యారు. ఆ సమయంలోనే పార్టీలో చేరాలనే నిర్ణయానికి వచ్చి ఉంటారని అంటున్నారు.
2023లో తొమ్మిది రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, 2024లో లోకసభ ఎన్నికలు ఉండటం, పైగా ఏపీలో బీజేపీకి అంతగా పట్టు లేకపోవడంతో ఢిల్లీ పెద్దలు ఇక్కడ లైట్ తీసుకుంటున్నట్లుగా చెబుతున్నారు. కర్నాటక, రాజస్థాన్, మధ్యప్రదేశ్, చత్తీస్గఢ్, డిసెంబర్లో తెలంగాణలో ఎన్నికలు ఉన్నాయి. వీటితో పాటు 4 ఈశాన్య రాష్ట్రాల్లో ఎన్నికలు ఉన్నాయి. దక్షిణాది విషయానికి వస్తే తెలంగాణలో అధికారం దిశగా పరుగు పెడుతోంది. వీటిపై దృష్టి సారిస్తున్న సమయంలో ఏపీ బీజేపీని కాస్త పక్కన పెట్టినట్లుగానే చెప్పవచ్చునని అంటున్నారు.