విశాఖపట్నంలో భూముల క్రయ విక్రయాలపై టీడీపీ నేతలు చేస్తోన్న ఆరోపణలపై స్పందించారు ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్. ఈ విమర్శలపై దమ్ముంటే ఆధారాలు చూపించాలని ఆయన సవాల్ విసిరారు. త్వరలో 1.50 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు ఏపీకి రానున్నాయని.. ఇన్పోసిస్ లాంటి సంస్ధలు విశాఖ కేంద్రంగా పని చేస్తున్నాయని అమర్నాథ్ వెల్లడించారు. త్వరలో విశాఖలో బిజినెస్ డెవలప్మెంట్ సమిట్ ఉంటుందని.. గతంలో లాగా డిప్లొమేటిక్ గా కాదన్నారు. విశాఖ రాజధానికి ఒక్క సెంటు కూడా ప్రైవేటు భూమి తీసుకోవడం లేదని అమర్నాథ్ స్పష్టం చేశారు. సిట్టింగులకే సీట్లిస్తాను అంటే ప్రతిపక్షంలో సగం మంది అసెంబ్లీకి రాలేదంటూ మంత్రి వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
పెట్టుబడులు, పారిశ్రామిక వృద్ధిలో గత ప్రభుత్వం కంటే మెరుగ్గా నిర్వహిస్తున్నామని గుడివాడ అమర్నాథ్ పేర్కొన్నారు. పాదయాత్ర పేరుతో రేపు వైజాగ్లో ఏమి జరిగినా చంద్రబాబు బాధ్యత వహించాలని ఆయన చెప్పారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ప్రధమ స్థానంలో ఏపీ ఉందని… 301 అంశాలను పరిగణనలోకి తీసుకొని ఈ ర్యాంకింగ్ ఇచ్చారని అమర్నాథ్ అన్నారు. చంద్రబాబు ఈస్ అఫ్ సెల్లింగ్ బిజినెస్ లో నంబర్ వన్ అంటూ మంత్రి సెటైర్లు వేశారు.