జనసేనాని పవన్ కళ్యాణ్ పై ఆంధ్రప్రదేశ్ మంత్రి ధర్మాన ప్రసాదరావు విమర్శల వర్షం కురిపించారు. పవన్ ఓ సీజనల్ పొలిటీషియన్ అంటూ సెటైర్లు వేశారు. పవన్ పూర్తిస్థాయిలో రాజకీయాల్లో ఉండరంటూ విమర్శలు చేశారు. ఆవేశపూరిత స్పీచ్ లతో పవన్ కల్యాణ్ యువతను అజ్ఞానంలోకి నెట్టే ప్రయత్నం చేస్తున్నారని ధర్మాన ఆరోపించారు. నాటి కిడ్నీ బాధితుల సమస్యలు నేడు ఉన్నాయా? అని ఆయన ప్రశ్నించారు. పుస్తకాలు చదవడం కాదు.. ఆ గొప్ప భావజాలం నీలో కనిపించాలని హితవు పలికారు ధర్మాన. అమరావతి పేరుతో జరుగుతున్న రియల్ఎస్టేట్ను పవన్ సమర్థిస్తున్నారని విమర్శించారు.
పవన్ ఎవరితో కలిసి ప్రయాణం చేయాలనుకుంటున్నారో క్లారిటీగా నిర్ణయించుకోవాలని ఆయన సూచించారు. నిజాయితీ ఉన్న నేతలకు మద్దతు ఇస్తామని చెప్తూ.. అవినీతిపరుడైన చంద్రబాబును సమర్థిస్తున్నావు. బాబులాంటి నీచ రాజకీయాలు చేసే వ్యక్తిని సమర్థిస్తూ.. మాకు శ్రీశ్రీ నీతులు చెబుతావా? అంటూ ధర్మాన పవన్ కల్యాణ్ ని నిలదీశారు. నీకు ఒక స్టాండ్ లేదని, లక్ష్యాన్ని ఎందుకు చేరుకోలేకపోతున్నారో ఆలోచించాలని ధర్మాన ప్రసాదరావు పవన్ కి సూచించారు. ప్రజల పన్నులన్నీ తీసుకువెళ్లి అమరావతి అభివృద్ధి చేస్తామంటే ఈ ప్రాంత వ్యక్తిగా తాను అంగీకరించని ఆయన అన్నారు. చంద్రబాబుకు పొరపాటున అధికారం ఇస్తే మళ్ళీ అమరావతిలోనే పెట్టుబడి పెడతారన్నారు. ఒకవేళ అదే జరిగితే విశాఖ కేంద్రంగా తమకు ప్రత్యేక రాష్ట్రం అడుగుతామన్నారు. తాను సైనికుల భూములు కబ్జా చేశానంటున్నారని.. నేను భూమి కబ్జా చేశానని ఏ సైనికుడైనా చెప్పారా? అని ధర్మాన ప్రశ్నించారు.