నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్ అంశం ఆంధ్రప్రదేశ్‌లో దుమారం రేపుతోంది. శ్రీధర్ రెడ్డి ఆరోపణలకు వైసీపీ నేతలు/ మంత్రులు కౌంటర్ ఇస్తున్నారు. కోటంరెడ్డి టీడీపీ నేతలతో టచ్‌లో ఉన్నారని మాజీమంత్రి పేర్ని నాని ఆరోపించారు. డిసెంబర్ 25వ తేదీన చంద్రబాబును కలిశారని పేర్కొన్నారు. ఎమ్మెల్యేలపై నిఘా పెట్టాల్సిన అవసరం తమకు లేదని చెప్పారు. సీఎం జగన్ అందరినీ నమ్ముతారని చెప్పారు. సీఎంపై చేసిన ఆరోపణలు ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నామని చెప్పారు.
కోటంరెడ్డి టీడీపీ ట్రాప్‌లో పడ్డారని చెప్పారు. ఫోన్ ట్యాపింగ్ మూడు నెలల నుంచి జరుగుతుంటే ఇప్పుడు ఎందుకు చెప్పారని కోటంరెడ్డిని నిలదీశారు. స్మార్ట్ ఫోన్లలో రికార్డింగ్ ఆప్షన్ కామన్‌గా జరుగుతుందన్నారు. ప్రజల్లో సానుభూతి కోసమే ఆరోపణలు చేస్తున్నారని పేర్ని నాని కొట్టిపారేశారు. మాజీ సీఎం చంద్రబాబు ట్యాపింగ్‌కి సంబంధించిన ఎక్విప్ మెంట్స్ కొనలేదని చెప్పారని గుర్తుచేశారు. తమ ప్రభుత్వం కూడా కొనలేదన్నారు. ఫోన్ ట్యాపింగ్ చేసే సదుపాయం ఎక్కడ ఉందని ప్రశ్నించారు. మంత్రి పదవీ ఇవ్వకపోతే ఇలా దిగజారి ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.
తన ఫోన్ ట్యాప్ చేశారని, గత నాలుగు నెలల నుంచి ఈ వ్యవహారం జరుగుతుందని కోటంరెడ్డి ఆరోపించారు. తమకు ఆ అవసరం లేదని ప్రభుత్వం చెబుతుంది. కాల్ రికార్డింగ్ అంశంపై ఇంటెలిజెన్స్ బ్యూరోతో విచారణ కూడా జరిపిస్తోంది. చంద్రబాబుతో కోటంరెడ్డి టచ్‌లో ఉన్నారని పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు.