బోరుగడ్డ అనిల్ ఫోన్ బెదిరింపు గురించి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మాట్లాడారు. ఏ ఫోన్ కాల్ అయినా తనకు ఎత్తడం అలవాటు అని చెప్పారు. మీటింగ్‌లో ఉన్నా, స్నానం చేసేప్పుడు వచ్చినా కాల్స్‌కు తిరిగి ఫోన్ చేస్తానని చెప్పారు. ఒక్కొక్కరు ఒక్కో సమస్యను చెబుతారు. కరెంట్ లేదని, చెత్త గురించి, పందులు, కుక్కలపై ఫిర్యాదు చేస్తుంటారని వివరించారు. పరిష్కరించే సమస్యను తన పీఏ సుబ్బన్నకు చెబుతానని తెలిపారు. 100 ఫోన్లలో 70 శాతం అభినందనలు చెబుతున్నారని తెలిపారు. 20 శాతం మంది బాధతో ఉన్నారని.. 10 శాతం మాత్రం బెదిరిస్తున్నారని పేర్కొన్నారు. వారిని తాను ఏమి అనడం లేదన్నారు. అలా బోరుగడ్డ అనిల్ కాల్ చేశారని వివరించారు. తనది ఐ ఫోన్ అని కాల్ రికార్డ్ కాదన్నారు. వారే రికార్డ్ చేసి.. పోస్టులు పెట్టారని చెప్పారు.
సజ్జల కోటరిలోనే వ్యక్తే..
అనిల్ గురించి కనుక్కుంటే ఆసక్తికర విషయం తెలిసిందన్నారు. ఇతను సజ్జల రామకృష్ణారెడ్డి కోటరిలోని వ్యక్తి అని కోటంరెడ్డి చెప్పారు. అలా ఐదారుగురు ఉంటారట.. వారికి ఇదే పనట అన్నారు. నిజానికి ఈ రోజు తాను మీడియా ముందు సజ్జల గురించి మాట్లాడాలని అనుకోలేదన్నారు. అనిల్ కాల్ రావడంతో ఆయన పేరు తీయాల్సి వస్తోందన్నారు. మీరు ఫోన్ చేస్తే భయపడేది లేదు.. ఎంత దూరమైనా వెళదాం అన్నారు. సజ్జల రామకృష్ణారెడ్డి ఇక నుంచి మీకు వీడియో కాల్స్ వస్తాయని కోటంరెడ్డి వార్నింగ్ ఇచ్చారు. సజ్జలకు నెల్లూరు రూరల్ మీదే పని ఉన్నట్టుంది.. అందుకే తనపై మాట్లాడాలని కొందరికి పని అప్పగించారని చెప్పారు. ఫర్లేదు, తాను భయపడబోనని తేల్చిచెప్పారు.
100 కేసులు పెట్టండి
కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అరెస్ట్ అంటూ మీడియాకు లీకులు ఇస్తున్నారని గుర్తుచేశారు. కార్పొరేటర్ చేత కిడ్నాప్ కేసు పెట్టించారని తెలిపారు. కార్పొరేటర్ మూట విజయ్ భాస్కర్ రెడ్డిని బెదిరించి లొంగదీస్తున్నారని ఆరోపించారు. అంతకుముందు భాస్కర్ దృష్టిలో తాను దేవుడినని చెప్పారు. కార్పొరేటర్‌గా అవకాశం ఇచ్చానని, దగ్గరుండి మరీ గెలిపించానని చెప్పారు. నెల్లూరు 26వ డివిజన్లో బీజేపీ నుంచి రాజేశ్ పోటీ చేశాడని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వివరించారు. అతను తనకు స్నేహితుడు అని, పార్టీ పరంగా విభేదాలు ఉంటాయన్నారు. రాజేశ్‌ను ఢీ కొట్టేందుకు సర్వశక్తులు ఓడ్డానని చెప్పారు. కష్టపడి గెలిపించిన విజయ్‌లో ఒక్కరోజులో మార్పు వచ్చిందని పేర్కొన్నారు. ఎందుకు ఇలా జరిగిందో తెలుసని.. దీని వెనక సజ్జల ఉన్నారని ఆరోపించారు.
ఆఫీసులో జగన్ ఫోటో
ప్లెక్సీలో విజయ్ తన ఫోటో తీయడంతో.. ఫోన్ చేసి మాట్లాడనని తెలిపారు. తన ఆఫీసులో ఇంకా జగన్ ఫోటోలు ఉన్నాయని అప్పుడే తొందరపడటం ఎందుకన్నారు. తర్వాత ఇంటికెళ్లి విజయ్ను కలిసానని.. వాళ్ల చెల్లి ఇంట్లోకి రమ్మని పిలిస్తే.. వెళ్లి టీ కూడా తాగానని చెప్పారు. ఆ తర్వాత విజయ్ ఏడ్చాడని, హత్తుకున్నాడని గుర్తుచేశారు. బయటకు వచ్చానో లేదో.. గంట సేపటిలో తనపై కిడ్నాప్ కేసు పెట్టించారని వివరించారు. ఆ కేసుతోపాటు హత్యాయత్నం కేసు పెట్టిస్తే బాగుండేదని చెప్పారు. తనపై 100 కేసులు పెట్టించిన భయపడబోనని తెలిపారు.
సజ్జల కుమారుడి నేతృత్వంలో
చాలా మంది కార్పొరేటర్లు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు తనను కలిసి మాట్లాడరని కోటంరెడ్డి తెలిపారు. కొందరు ఇబ్బందులు ఉన్నాయని చెప్పారని, సరే అన్నానని వివరించారు. కార్పొరేటర్లు రూ.60 లక్షలు బిల్ అని ఒకరు, రూ.70 లక్షలు అని మరొకరు.. కోటి అని ఇంకొకరు చెప్పారు. బిల్ అయిన తర్వాత తనతో కలిసి నడుస్తానని చెప్పారన్నారు. అందుకోసం 15 రోజులు పట్టొచ్చు.. 2 నెలలు పట్టొచ్చు.. లేదంటే ఎన్నికకు 2 నెలల ముందు రావొచ్చన్నారు. సర్పంచ్, ఎంపీటీసీలు కూడా అంతేనని చెప్పారు. తనతో ఉండేవారు బంధాలు, అనుబంధాలతో నడుస్తారని చెప్పారు. ఒకవేళ వెళ్లినవారు కూడా తిరిగి వస్తారని చెప్పారు. సజ్జల రామకృష్ణారెడ్డి కుమారుడు భార్గవ్ రెడ్డి నేతృత్వంలో కొందరు ఇలాంటి పనులు చేస్తున్నారని తెలిపారు. వారే బెదింరిపులకు దిగుతున్నారని చెప్పారు. ఐ ప్యాక్ టీమ్ కూడా ఏర్పాటు చేశారట.. కార్పొరేటర్లతో మాట్లాడుతున్నారట అని వివరించారు.