బాబా రాందేవ్ మహిళలను ఉద్దేశించిన చేసిన వ్యాఖ్యలపై సీపీఐ నారాయణ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. బాబా రాందేవ్ ని చెప్పుతో కొట్టాలి అని ఆయన మండిపడ్డారు. మహిళల పట్ల ఆయన చేసిన వ్యాఖ్యలను వ్యతిరేకించడంతో పాటు.. బాబా రాందేవ్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
యోగాను కార్పొరేట్ వ్యవస్థగా మార్చి… పతాంజలి పేరుతో వ్యాపారాలు చేస్తున్నారన్నారు. యోగ పేరుతో అందరి దగ్గర సానుభూతి నటిస్తూ వెనకాల కార్పొరేట్ వ్యవస్థను నడుపుతున్నారని నారాయణ ఆరోపించారు. మహిళలు నగ్నంగా ఉంటే బాగుంటారనే వ్యాఖ్యలు దారుణమని అన్నారు. మహిళా వ్యతిరేక చట్టం కింద ఆయనను శిక్షించాలని డిమాండ్ చేశారు. ఆ కార్యక్రమంలో అక్కడున్న మహిళలు ఆయనను చెప్పుతో కొడితే బాగుండేది అన్నారు.
అసలేం జరిగిందంటే..ముంబైలోని థానేలో పతంజలి యోగా పీఠ్, ముంబై మహిళా పతంజలి యోగా సమితి ఆధ్వర్యంలో ఓ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న బాబా రాందేవ్ మాట్లాడుతూ నోరు జారారు.
మహిళలు చీరల్లో బాగుంటారని, సల్వార్ సూట్లలోనూ అంతే బాగా అందంగా కనిపిస్తారని చెప్పారు. తన కండ్లకు అయితే వాళ్లు ఏ దుస్తులు ధరించకున్నా బాగుంటారని ఆయన అన్నారు. యోగా తరగతులకు వస్తున్న మహిళలను ఉద్దేశిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.