ఆంధ్రప్రదేశ్ మంత్రి రాంబాబు ఊహించిన చిక్కు ఎదురైంది. ఆయన మెడకు ఓ కోర్టు కేసు వచ్చి చుట్టుకుంది. ఇంతకీ మ్యాటరేంటంటే… అంబటి రాంబాబు సత్తెనపల్లిలో సంక్రాంతి లక్కీ డ్రా పేరుతో టిక్కెట్లు అమ్మకాలు చేస్తున్నారని జనసేన జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరా రావు కోర్టులో పిటిషన్ వేశారు. సత్తెనపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని కోర్టుకు వివరించారు.
మంత్రి అంబటి రాంబాబు ఆధ్వర్యంలో టిక్కెట్లు అమ్మకాలు జరిగాయని గాదె వెంకటేశ్వరరావు కోర్టుకు కొన్ని ఆధారాలను సమర్పించారు. పూర్వాపరాలను పరిశీలించిన అనంతరం కోర్టు స్పందించింది. అంబటి రాంబాబుపై తక్షణమే కేసు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించింది. ఫిబ్రవరి 21 లోపు విచారణ పూర్తి చేసి కోర్టుకు వాస్తవాలు తెలపాలని సత్తెనపల్లి పోలీసులకు కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
అంబటి రాంబాబుపై జనసేన నేతలు చాలా కాలంగా గుర్రుగా ఉన్నారు. తమ అధినేత పవన్ కళ్యాణ్‌ను, అంబటి రాంబాబు పలు సందర్భాల్లో విమర్శించడంతో వారంతా అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు. లక్కీ డ్రా రూపంలో అవకాశం రావడంతో వెంటనే స్పందించారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా లాభం లేకపోవడంతో ఏకంగా కోర్టును ఆశ్రయించారు. అంబటిపై కేసు నమోదు అయ్యేలా చేశారు.