»Change Of Diwali Holiday In Ap Sarkar Issued Orders
Diwali Holiday: ఏపీలో దీపావళి సెలవు మార్పు..ఉత్తర్వులు జారీ చేసిన సర్కార్
ఆంధ్రప్రదేశ్లో దీపావళి సెలవు తేదీని ఏపీ సర్కార్ మారుస్తూ ఉత్తర్వులిచ్చింది. నవంబర్ 13న సోమవారం రోజు దీపావళి పండగను జరుపుకోవాలని సూచించింది. దీంతో ఏపీ ప్రజలకు వరుసగా 3 రోజుల పాటు సెలవులు రానున్నాయి.
దీపావళి సెలవు (Diwali Holiday) రోజును మారుస్తూ ఏపీ సర్కార్ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో ప్రకటించిన సెలవు రోజును మార్పు చేసింది. ఇదివరకూ నవంబర్ 12వ తేదిన దీపావళి సెలవుగా ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు దాన్ని నవంబర్ 13వ తేదికి మారుస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ప్రభుత్వ సంస్థలు, ఉద్యోగులు, ప్రైవేటు సంస్థలు కూడా దీన్ని అమలు చేయనున్నాయి.
ప్రతి సంవత్సరం ఉద్యోగులకు ఇచ్చే సాధారణ సెలవులను అంతకుముందు సంవత్సరం డిసెంబర్ నెలలోనే ప్రభుత్వం ప్రకటిస్తూ వస్తుంది. దాని ప్రకారంగా నవంబర్ 12వ తేదినే దీపావళి సెలవు అని ప్రకటించింది. అప్పట్లో దానికి సంబంధించిన ఉత్తర్వులు, నోటిఫికేషన్ కూడా విడులైన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు తాజాగా పండితుల సలహా మేరకు ఆ సెలవును మార్పు చేసింది. నవంబర్ 13వ తేదికి దీపావళి సెలవును మారుస్తూ ప్రభుత్వం ఉత్తర్వులను సవరించినట్లు తెలిపింది.
వ్యాపార సంస్థలకు, ఆఫీసులకు కూడా నెగోషియబుల్ చట్టం కింద ప్రభుత్వం నిర్ణయించిన సెలవు వర్తించనుంది. ఇకపోతే ప్రతిఏటా దీపావళి సెలవును తిథి ద్వయం తిధుల ఆధారంగా పండితులు నిర్ణయిస్తూ ఉంటారు. ఈసారి కూడా ప్రభుత్వానికి వచ్చిన సలహాలు, వినతుల మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ప్రభుత్వ ఆదేశాల మేరకు సాధారణ పరిపాలన శాఖ తరపున సీఎస్ జవహర్ రెడ్డి ఈ సెలవు ఉత్తర్వులను జారీ చేశారు.
దీపావళి సెలవుకు సంబంధించిన ప్రభుత్వ ఉత్తర్వుల జారీ నేపథ్యంలో వరుసగా మూడు రోజుల పాటు సెలవులు రానున్నాయి. నవంబర్ 11న రెండో శనివారం, నవంబర్ 12న ఆదివారం, నవంబర్ 13న సోమవారం రోజు దీపావళి కాబట్టి మూడు రోజుల పాటు ప్రభుత్వ సంస్థలకు, విద్యార్థులకు సెలవులు రానున్నాయి. దీంతో ఏపీ ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.