Botsa నోటి దురుసు.. టీఎస్ పీఎస్సీలో అన్నీ చూచిరాతలే
టీఎస్ పీఎస్సీ నిర్వహించే పరీక్షలో చూచిరాతలేనని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ కామెంట్స్ చేశారు. పేపర్ లీకేజ్ స్కామ్‌లో ఎందరు అరెస్ట్ అయ్యారో చూశాం అన్నారు.
Botsa Satyanarayana: విజయవాడలో ట్రిపుల్ ఐటీ ప్రవేశాలను ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించారు. ఈ నెల 20వ తేదీ నుంచి 25వ తేదీ వరకు ట్రిపుల్ ఐటీ ప్రవేశాలకు కౌన్సిలింగ్ జరుగుతుందని తెలిపారు. ఆ క్రమంలో మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో సీట్లు, ఇతర అంశాలను మీడియా ప్రతినిధులు ప్రశ్నించారు. దీంతో ఆయనకు చిర్రెత్తుకు వచ్చింది. తెలంగాణ విద్యా విధానం గురించి రోజు మనం చూస్తూనే ఉన్నాం అన్నారు.
టీఎస్ పీఎస్సీ పరీక్షలు ఎలా జరుగుతున్నాయో తెలుసు కదా అని అడిగారు. అన్నీ చూచి రాతలేనని విమర్శలు చేశారు. పేపర్ లీకేజ్ స్కామ్‌లో ఎంతమంది అరెస్ట్ అయ్యారో చూశాం కదా.. ఎందరు ఇన్వాల్వ్ అయ్యారో రోజు బయట పడుతుంది కదా అన్నారు. ఏపీకి తెలంగాణకు సంబంధం లేదు.. ఎవరి విధానం వారిది.. ఆలోచన వారిది.. లైన్ వారిది అని తెలిపారు. అలాగే తెలంగాణ గురించి కామెంట్ చేయనని తెలిపారు. టీచర్లను కూడా బదిలీ చేసుకోలేని పరిస్థితి వారిదని మండిపడ్డారు.
వాలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన కామెంట్లను మీడియా ప్రతినిధులు అడిగారు. పొద్దునే పవన్ గురించి మాట్లాడటం ఎందుకు అని బొత్స అన్నారు. ఆ కామెంట్లను పట్టించుకోకుండా ఉంటే మంచిదని తెలిపారు. వాలంటీర్ వ్యవస్థ ఎలా పుట్టిందనే విషయం తొలుత పవన్ కల్యాణ్ తెలుసుకోవాలని సూచించారు.
బొత్స అలా అన్నారో లేదో తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్పందించారు. హైదరాబాద్ రాకుంటే వారికి పూట గడవదు అని మండిపడ్డారు. రాజధాని కూడా లేని రాష్ట్రం ఏపీ అని విమర్శించారు. గతంలో ఏపీ పీఎస్సీలో స్కామ్‌లు జరిగాయని తెలిపారు.