ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుగా అలీ బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. కాగా… బాధ్యతలు చేపట్టిన తర్వాత… మొదటి సారి అలీ… పవన్ పై విమర్శలు చేయడం గమనార్హం. ప్రభుత్వంపై పవన్ చేస్తున్న ఆరోపణలు కరెక్ట్ కాదంటూ అలీ పేర్కొనడం గమనార్హం.
గుంటూరు జిల్లా ఇప్పటం గ్రామంలో రోడ్డు విస్తరణ పేరుతో వైఎస్ జగన్ ప్రభుత్వం ఇళ్లను కూల్చేస్తోందని.. జనసేన పార్టీ ప్లీనరీ కోసం గ్రామ ప్రజలు స్థలం ఇవ్వడంతో ప్రభుత్వం కక్షగట్టి ఇళ్లను కూలుస్తోందని.. ఈ దౌర్జన్యాన్ని చూస్తూ ఊరుకోమని పవన్ కళ్యాణ్ చేసిన ఆరోపణలను అలీ తప్పుబట్టారు.
‘‘నాకు తెలిసి ఆ ఆరోపణలు కరెక్ట్ కాదు. ప్రజల ఆదరణ పొందిన పార్టీ వైఎస్సార్సీపీ. ప్రజలు 151 సీట్లు ఇచ్చారు. ప్రజలు ఊరకనే తీసుకొచ్చి చేతిలో పెట్టేయలేదు. మీ పాలన బాగుంటుంది.. అద్భుతమవుతుంది, స్వర్ణాంధ్రప్రదేశ్ అవుతుంది అని నమ్మారు. విశాఖపట్నం కావచ్చు.. రాయలసీమ కావచ్చు అన్ని చోట్లా అభివృద్ధి జరుగుతోంది.
మొన్న ఉత్తరాంధ్ర షూటింగ్కు వెళ్లాం.. ఆ బీచ్లు కానీ, రోడ్లు కానీ అద్భుతంగా ఉన్నాయి. అప్పట్లో డవలెప్మెంట్ లేని రోజుల్లో కూడా షూటింగ్లు జరిగాయి. ఇప్పుడు డవలెప్ చేస్తే తెలుగు సినిమాలే కాదు.. తమిళం, హిందీ, మలయాళం, కన్నడ ఫిలింస్ మన దగ్గరికి వస్తాయి. మనం వెళ్లి అక్కడ చేసుకుంటున్నాం.. వాళ్లొచ్చి ఇక్కడ చేసుకుంటే మనకు ఉపాధి దొరుకుతుంది’’ అని అలీ చెప్పుకొచ్చారు.