»A Teacher Who Took A Student To A Temple And Forced Her To Marry Him At Chittoor Ap
Minor: విద్యార్థినిని బలవంతంగా గుడికి తీసుకెళ్లి పెళ్లి చేసుకున్న ఉపాధ్యాయుడు
విద్యార్థులకు విద్యా బుద్ధులు చెప్పాల్సిన ఉపాధ్యాయుడు ఓ మైనర్ విద్యార్థిని విషయంలో తప్పుగా ప్రవర్తించాడు. అంతటితో ఆగలేదు. ఆ యువతికి మాయ మాటలు చెప్పి ఏకంగా తిరుపతి తీసుకేళ్లి పెళ్లి కూడా చేసుకున్నాడు. అయితే అతని ప్రవర్తనను గుర్తించిన బాలిక తన పేరెంట్స్ కు విషయం చెప్పడంతో పోలీసులకు చెప్పారు. దీంతో అతన్ని అరెస్టు చేశారు.
విద్యార్థులకు పాఠాలు చెప్పాల్సిన ఉపాధ్యాయుడు..ఏకంగా ఓ విద్యార్థినికి మాయ మాటలు చెప్పి బలవంతంగా పెళ్లి చేసుకున్నాడు. ఈ ఘటన ఎక్కడో కాదు ఏపీలోని చిత్తూరు జిల్లా గంగవరం మండలంలో చోటుచేసుకుంది. ఇక వివరాల్లోకి వెళితే బుధవారం ఆ బాలికకు ఇంటర్ ఫైనల్ పరీక్షలు జరిగాయి. ఆ పరీక్షల అనంతరం నిందితుడు చలపతి ఆమెకు మాయ మాటలు చెప్పి బాలికను తిరుపతికి తీసుకెళ్లాడు. ఆ తర్వాత వారిద్దరూ అక్కడ ఓ గుడిలో పెళ్లి చేసుకున్నారు.
ఆ క్రమంలో చలపతి ప్రవర్తనలో వచ్చిన మార్పును బాలిక గమనించింది. దీంతో ఆ బాలిక తన తల్లిదండ్రులతో జరిగిన మొత్తం విషయాన్ని తెలియజేసింది. దీంతో బాలిక తన తల్లిదండ్రులతో కలిసి గురువారం రాత్రి గంగవరం పోలీస్ స్టేషన్‌కు చేరుకుని అతనిపై ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు అతనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించి అతన్ని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడైన ఉపాధ్యాయుడు చలపతి (33)పై లైంగిక నేరాల నుంచి పిల్లల రక్షణ (పోక్సో) చట్టం కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
అయితే విచారణలో నిందితుడు తాను నిజాయితీపరుడని, తనను నమ్మాలని, ఆమెను చూసుకుంటానని బాలికకు చెప్పినట్లు ఎస్ఐ సుధాకర్‌రెడ్డి తెలిపారు. మరోవైపు నిందితుడికి ఇదివరకే వివాహమై ఓ కూతురు కూడా ఉందని పేర్కొన్నారు. 12వ తరగతి చదువుతున్న 17 ఏళ్ల యువతితో అతను సంబంధం పెట్టుకున్నట్లు వెల్లడించారు. ఈ క్రమంలో నిందితుడిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచినట్లు పోలీసులు వెల్లడించారు.