టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ది ఐరన్ లెగ్ అని.. అందుకే తారకరత్నకు గుండెపోటు వచ్చిందని ఆంధ్రప్రదేశ్ మంత్రి ఆర్కే రోజా ఆరోపించారు. లోకేశ్ ఎక్కడ అడుగుపెడితే అక్కడ దారుణాలు జరుగుతాయని పరోక్షంగా చెప్పారు. ఆయన తండ్రి చంద్రబాబు సైకో అయితే.. అతడి కుమారుడు లోకేశ్ ఐరన్ లెగ్.. సైకో అని తెలిపారు. కుప్పంలో యువగళం పాదయాత్ర ప్రారంభోత్సవం సందర్భంగా లోకేశ్ గతంలో తనపై రోజా చేసిన వ్యాఖ్యలపై స్పందించాడు.
తాజాగా లోకేశ్ వ్యాఖ్యలపై మంత్రి రోజా స్పందించారు. లోకేశ్ పాండిత్యాన్ని చూసి ఆయన్ను పులకేసి అనవచ్చని పేర్కొన్నారు. నిరుద్యోగులంతా రాష్ట్రంలో సంతోషంగా ఉన్నారని, రోడ్డు మీదకు వచ్చింది చంద్రబాబు, లోకేశ్, పవన్ కల్యాణ్ మాత్రమేనన్నారు. లోకేశ్ పాదయాత్ర విజయవంతమవడంపై రోజాను విలేకరులు ప్రశ్నించగా.. లోకేశ్ ది ఐరన్ లెగ్ అని పేర్కొన్నారు. ‘ఆయన తొలిసారి గోదావరి పుష్కరాలకు వస్తే 29 మందిని పొట్టన పెట్టుకున్నాడు. ఎమ్మెల్సీగా ప్రమాణస్వీకారం చేసిన రోజు వాళ్ల నాన్నకు ఓటుకు నోటు కేసులో నోటీసులు వచ్చాయి. యువగళం పాదయాత్ర పోస్టర్ విడుదల చేస్తే 8 మంది చనిపోయారు. ఇక పాదయాత్ర ప్రారంభించడంతో తారకరత్నకు గుండెపోటు వచ్చింది’ అని రోజా తెలిపారు.
తారకరత్న ఆరోగ్యం మెరుగవ్వాలని మనస్ఫూర్తిగా కోరుతున్నట్లు రోజా చెప్పారు. తారకరత్నకు గుండెపోటు వచ్చినా పట్టించుకోకుండా లోకేశ్ రాజకీయాల కోసం తమను విమర్శించడమే పనిగా పెట్టుకున్నాడని రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు.