గతంలో దేశవ్యాప్తంగా చాలా మంది రైతులు ప్రాణాలు వదిలారు. ఓ వైపు అప్పుల బాధలు, మరో వైపు పంట నష్టాలను భరించలేక కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకున్నవారు చాలా మంది ఉన్నారు. అయితే తాజాగా మహారాష్ట్రలో 2,366 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నట్లు మంత్రి అనిల్ భాయిదాస్ పాటిల్ వెల్లడించారు. గురువారం ఆయన ఆ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల్లో రైతు ఆత్మహత్యల గురించి ప్రకటించారు.
ఈ ఏడాది పది నెలల కాలంలో అంటే 2023 జనవరి నెల నుంచి అక్టోబర్ నెల వరకూ 2366 మంది రైతులు చనిపోయినట్లుగా ఆయన వెల్లడించారు. అందులో మహారాష్ట్రలోని అమరావతి రెవెన్యూ డివిజన్ (Amarawati Revenue Division)లోనే అత్యధికంగా 951 మంది రైతులు ఆత్మహత్య (Farmers Suicide) చేసుకున్నట్లుగా తెలిపారు.
అసెంబ్లీ సమావేశాల్లో రైతుల ఆత్మహత్యలపై కాంగ్రెస్ ఎమ్మెల్యే కునాల్ పాటిల్ ప్రశ్న అడగ్గా అందుకు మంత్రి అనిల్ భాయిదాస్ పాటిల్ రాతపూర్వకంగా సమాధానం అందించారు. అమరావతి రెవెన్యూ డివిజన్ తర్వాత ఛత్రపతి సాంబాజీనగర్ డివిజన్లో 877 మంది, నాగపూర్ డివిజన్లో 257 మంది, నాశిక్ డివిజన్లో 254 మంది, పుణె డివిజన్లో 27 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నట్లుగా మంత్రి అనిల్ భాయిదాస్ పాటిల్ స్పష్టం చేశారు. ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు లక్ష రూపాయల ఆర్థిక సాయాన్ని అందించినట్లు వెల్లడించారు.