»Lets Fight To Throw Jagan Out Of Politics Pawan Kalyan
Janasena: జగన్ను రాజకీయాల నుంచి బయటకు పంపే యుద్ధం చేద్దాం: పవన్ కళ్యాణ్
ఏపీలో జగన్ పాలనను అంతం చేసి ఆయన్ని పదేళ్లపాటు బయటకు తరిమికొడదామని జనసేన అధినేత పవన్ పిలుపునిచ్చారు. జనసేన టీడీపీ వెనక ఉండి నడవడం లేదని, టీడీపీతో కలిసి నడుస్తోందని తెలిపారు.
ఏపీ సీఎం జగన్ (Cm Jagan)ను పదేళ్ల పాటు రాజకీయాల నుంచి బయటకు పంపేందుకు యుద్ధం చేద్దామని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) అన్నారు. నేడు మంగళగిరిలోని జనసేన ప్రధాన కార్యాలయంలో పార్టీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి పవన్ హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ..వైఎస్ జగన్ రాజకీయాల్లో ఉండకూడదని, ఆయన్ని పదేళ్ల పాటు బయట కూర్చోబెడతామనే వ్యాఖ్యలు చేశారు.
జగన్ ఏమీ మహనీయుడు కాదని, ఆయనలో విషం తొలగి మంచిగా మారిన తర్వాతనే రాజకీయాల్లోకి రానిద్దామని అన్నారు. ఏపీలో మరో 100 రోజుల్లో ఎన్నికలు రానున్నాయని, ప్రతి రోజూ వైసీపీ ఓట్ షేర్ 0.5 శాతం తగ్గేలా పనిచేద్దామన్నారు. జగన్ను బయటకు పంపించే యుద్ధం చేద్దామని జనసేన శ్రేణులకు పిలుపునిచ్చారు. ఆనాడు 150 మందితో ప్రారంభమైన జనసేన పార్టీ (Janasena Party) నేడు 6.5 లక్షల క్రియాశీలక సభ్యులతో బలంగా ఉందన్నారు.
లక్ష కోట్లు దోచిన వ్యక్తిని వదిలే ప్రసక్తే లేదని పవన్ ఫైర్ అయ్యారు. బీజేపీ (Bjp) అధినేత జేపీ నడ్డా (Jp Nadda) కూడా జనసైనికుల ఉత్సాహం చూసి పార్టీ కండువా అడిగిమరీ వేయించుకున్నారన్నారు. ప్రాంతీయ పార్టీలకు వ్యతిరేకంగా ఉండే బీజేపీ నేడు జనసేన పట్ల గౌరవం చూపిస్తోందన్నారు. వైసీపీ నేతలను తరిమికొట్టేందుకు నేడు జనసేన, టీడీపీలు కలిసి పనిచేస్తున్నాయని, అది జనసేన నేతల ఇష్టప్రకారంగానే తీసుకున్న నిర్ణయమని తెలిపారు. టీడీపీ వెనక ఉండి జనసేన నడవడం లేదని, టీడీపీతో కలిసి నడుస్తోందని పవన్ కళ్యాణ్ అన్నారు.