»Cheddigang Ruckus Again In Ap Police Warning To People
Cheddi Gang: ఏపీలో మళ్లీ చెడ్డీగ్యాంగ్ హల్చల్.. ప్రజలకు పోలీసుల హెచ్చరిక
తిరుపతిలో చెడ్డీ గ్యాంగ్ రెచ్చిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియోను పోలీసులు విడుదల చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎవ్వరూ కాలింగ్ బెల్ కొట్టినా వారెవరో తెలుసుకుని తలుపులు తీయాలని, అనుమానిత వ్యక్తులు కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని పోలీసులు సూచించారు.
గత కొన్ని రోజుల క్రితం చెడ్డీగ్యాంగ్ ప్రజలను భయభ్రాంతులకు గురిచేసిన సంగతి తెలిసిందే. చెడ్డీగ్యాంగ్‌కు భయపడి అప్పట్లో చాలా మంది బిక్కు బిక్కుమన్నారు. పోలీసులు ఎన్ని చర్యలు చేపట్టినా వారి ఆగడాలు మాత్రం ఆగలేదు. వరుస ఘటనలతో చెడ్డీ గ్యాంగ్ వార్తల్లో నిలిచి సామాన్యులకు భయాందోళన కలిగించాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్‌లో ఈ చెడ్డీ గ్యాంగ్ మరోమారు కలకలం రేపింది.
పోలీసులు విడుదల చేసిన వీడియో:
టెంపుల్ సిటీగా ప్రఖ్యాతి చెందిన తిరుపతి, ఆ నగర పరిసర ప్రాంతాల్లో ఈ చెడ్డీ గ్యాంగ్ సంచరిస్తున్నట్లు సీసీటీవీ ఫుటేజ్ వైరల్ అవుతోంది. ఈ తరుణంలో ప్రజలకు పోలీసులు హెచ్చరికలు జారీ చేస్తూ చర్యలు చేపట్టారు. చెడ్డీగ్యాంగ్ నగరంలో సంచరిస్తోందని, ఊర్లకు వెళ్లేవారు, ఒంటరిగా ఉండేవారు, తీర్థయాత్రలకు వెళ్లేవారంతా అప్రమత్తంగా ఉండాలని, రాత్రి సమయంలో కాలింగ్ బెల్ కొట్టినా, తలుపులు తట్టినా ఎట్టి పరిస్థితిలో తీయొద్దని హెచ్చరికలు జారీ చేశారు.
ఒకవేళ ఎవరైనా అనుమానిత వ్యక్తులు కనిపిస్తే వెంటనే డయల్ 100కి కాల్ చేసి పోలీసులను సంప్రదించాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్‌లో ఈ చెడ్డీ గ్యాంగ్ గత మూడేళ్లుగా తిరుగుతోందని పోలీసులు వెల్లడించారు. 2021లో కూడా తిరుపతిలోని విద్యానగర్‌లో చోరీకి విఫలయత్నం చేసిందని, బృందావన కాలనీలో ఓ ఇంట్లోకి ప్రవేశించి చోరీ చేసినట్లు పోలీసులు తెలిపారు. చెడ్డీ గ్యాంగ్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ఈ గ్యాంగ్ ముఖ్యంగా తాళాలు వేసిన ఇళ్లను టార్గెట్‌గా చేసుకుని చోరీలకు పాల్పడుతున్నట్లు పోలీసులు వెల్లడించారు. చెడ్డీ గ్యాంగ్ సంచరిస్తుండగా రికార్డ్ అయిన సీసీటీవీ ఫుటేజ్‌ను పోలీసులు విడుదల చేశారు. ఇంట్లో బంగారం, నగదు దాచుకుని ఉన్నవారు వెంటనే వాటిని భద్రపరుచుకోవాలని, ప్రాణాలు తీయడానికైనా ఈ చెడ్డీ గ్యాంగ్ వెనకాడదని, అందుకే ప్రజలు జాగ్రత్తగా ఉండాలని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు.