»Full Focus On Students One Nation One Student Card Center
One Nation One ID : విద్యార్థులపై ఫుల్ ఫోకస్..‘వన్ నేషన్-వన్ స్టూడెంట్ కార్డు’ తేనున్న కేంద్రం!
ప్రభుత్వ, ప్రైవేటు విద్యార్థుల కోసం కేంద్రం వన్ నేషన్ వన్ స్టూడెంట్ ఐడీ కార్డును తీసుకురానుంది. ఇందులో స్టూడెంట్స్ డేటాతో పాటుగా వారు సాధించిన విజయాలను నమోదు చేయనుంది. దీని వల్ల విద్యార్థులకు అనేక రకాలుగా ప్రయోజనం కలుగుతుందని విద్యాశాఖ భావిస్తోంది.
ఆధార్ కార్డు (Adhar Card) తరహాలోనే విద్యార్థులకు కూడా ఓ ప్రత్యేక గుర్తింపు కార్డును ఇవ్వడానికి కేంద్రం ప్రణాళిక వేస్తోంది. వన్ నేషన్-వన్ స్టూడెంట్ కార్డును తెచ్చే యోచనలో కేంద్ర విద్యాశాఖ చర్యలు తీసుకోనుంది. దేశవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులకు ఈ కార్డును ఇవ్వడానికి సమాయత్తమవుతోంది. ఆ గుర్తింపు కార్డును ఆటోమేటెడ్ పర్మినెంట్ అకడమిక్ అకౌంట్ రిజిస్ట్రీ (అపార్) APAARగా పిలువనున్నారు. అపార్ ఐడీ కార్డులు ఇచ్చే ప్రక్రియను ప్రారంభించాలని అన్ని రాష్ట్రాలు, యూటీలకు కేంద్ర విద్యాశాఖ ఆదేశాలిచ్చింది.
ఈ అపార్ నంబర్ (APAAR Number)ను ఆ విద్యార్థి జీవితకాల ఐడీగా పరిగణలోకి తీసుకోనున్నారు. అందులో ఆ విద్యార్థి అకడమిక్ జర్నీ, విద్యా చరిత్ర, విజయాలు వంటివి నిక్షిప్తం అయ్యి ఉంటాయి. కేంద్రానికి అవసరమైన సమయంలో విద్యార్థి ట్రాక్ రికార్డును ఇందులో పరిశీలించే అవకాశం కూడా ఉంటుంది. ఈ అపార్ ఐడీ కార్డులు ఇచ్చే విషయంపై విద్యార్థుల తల్లిదండ్రులతో అక్టోబర్ 16వ తేది నుంచి 18వ తేది వరకూ పలు సమావేశాలను నిర్వహించనున్నట్లు కేంద్రం తెలిపింది.
ఇందులో ఉంచిన విద్యార్థుల డేటా (Students Data) రహస్యంగా ఉంటుందని, ప్రభుత్వ ఏజెన్సీలతో మాత్రమే ఆ డేటాను పంచుకునే అవకాశం ఉంటుందని విద్యాశాఖ వెల్లడించింది. వన్ నేషన్ వన్ స్టూడెంట్ ఐడీ (One Nation One Student ID) స్కీమ్‌పై ఏఐసీటీఈ ఛైర్మన్ టీజీ సీతారామన్ మాట్లాడారు. ఈ ఐడీ ద్వారా దేశంలోని విద్యార్థుల నైపుణ్యం తెలుస్తుందని, వారు సాధించిన విజయాలు రికార్డు అవుతాయన్నారు.