Congressకు పది సార్లు అవకాశం ఇస్తే ఏం చేసింది: కేసీఆర్
వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ 95 నుంచి 105 సీట్లు గెలుస్తోందని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. హుస్నాబాద్‌లో ఎన్నికల సమర శంఖారావాన్ని కేసీఆర్ పూరించారు.
CM KCR: అసెంబ్లీ ఎన్నికల ప్రచార పర్వాన్ని హుస్నాబాద్ వేదికగా సీఎం కేసీఆర్ (CM KCR) ప్రారంభించారు. ప్రజా ఆశీర్వాద సభతో ఎన్నికల శంఖారావాన్ని పూరించారు. 95 నుంచి 105 సీట్లు గెలవడానికి హుస్సాబాద్ సభ నాంది కావాలని కేసీఆర్ పిలుపునిచ్చారు. గత తొమ్మిదేళ్లలో జరిగిన అభివృద్ధిని ప్రజలకు వివరించారు. హుస్నాబాద్ నియోజకవర్గానికి 6 నెలల్లో లక్ష ఎకరాలకు నీళ్లు వస్తాయని తెలిపారు. ప్రాజెక్టులు, చెక్ డ్యామ్‌లతో భూగర్భ జలాలు పెరిగాయని వివరించారు. వీరభద్ర స్వామి ఆలయాన్ని డెవపల్ చేస్తానని.. ఎల్కతుర్తిలో బస్టాండ్, ప్రభుత్వ జూనియర్ కాలేజీ ఏర్పాటు చేస్తామని తెలిపారు. శనిగరం ప్రాజెక్ట్ పూర్తి చేస్తామని హామీనిచ్చారు.
కొన్ని పార్టీలు వచ్చి మాయమాటలు చెబుతాయి.. ఒక్క అవకాశం ఇవ్వాలని కోరతాయి.. కాంగ్రెస్ పార్టీకి పది సార్లు అవకాశాలు ఇచ్చారని, ఏం చేశారని అడిగారు. రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ అంధకారం చేసిందని తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ఎలా ఉండేది.. ఇప్పుడు ఎలా ఉందని అడిగారు. గతంలో విద్యుత్ కోత, సాగునీరు సమస్యలు, తాగునీటి సమస్యలు ఉండేవన్నారు. రాష్ట్రంలో వలసలు ఉండేవని వివరించారు. రైతు బంధుతో వ్యవసాయ విధానమే మారిపోయిందని తెలిపారు.
ఎన్నికలు వస్తాయి.. పోతాయ్.. ఎన్నికలు రాగానే కొందరు వస్తారని.. రత్నం ఏందో, రాయి ఏదో గుర్తించాలని కోరారు. ఓటు తలరాతను మారుస్తుంది.. తాలుకా, జిల్లా రాతను మారుస్తుందన్నారు. రాష్ట్ర భవిష్యత్ మారుస్తోందని తెలిపారు. ఓటింగ్ జరిగిన సమయంలో ప్రజలు గెలుస్తారు.. వారి పరిస్థితులు మారతాయని పేర్కొన్నారు. కొత్త కుండలో ఈగ చొచ్చినట్టు.. కొత్త సంసారం.. రాష్ట్రం ఏర్పడిన సమయంలో ఉండేదని కేసీఆర్ అన్నారు. 60 ఏళ్ల క్రితం దళితబంధు ప్రారంభిస్తే ఈ సమస్య ఉండేది కాదన్నారు.