Congress గ్యారంటీలను కేసీఆర్ కాపీ కొట్టారు.. రేవంత్ ఫైర్
కాంగ్రెస్ గ్యారంటీలు చూసి సీఎం కేసీఆర్ మైండ్ బ్లాంక్ అయ్యిందని టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. తమ గ్యారెంటీలను అంశాలను కాపీ కొట్టారని మండిపడ్డారు.
Revanth Reddy: మందు బోయకుంటే, అణ పైసా పంచకుంటా ఎన్నికల్లో పోటీ చేద్దాం అని రేవంత్ రెడ్డి (Revanth Reddy) బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు సవాల్ విసిరారు. 17వ తేదీన అమరవీరుల స్థూపం వద్ద ప్రమాణం చేద్దాం అని ఛాలెంజ్ చేశారు. మధ్యాహ్నం 12 గంటలకు కేసీఆర్ను అక్కడికి తీసుకురావాలని మీడియా ప్రతినిధులను రేవంత్ కోరారు. 55 లక్షల మందికి 1వ తేదీన ఆసరా పెన్షన్లు ఎందుకు ఇవ్వడం లేదని అడిగారు. ప్రభుత్వ ఉద్యోగులకు కూడా జీతం వేయడం లేదని.. నవంబర్ 1వ తేదీన వేయాలని డిమాండ్ చేశారు. అప్పుడు మేనిఫెస్టోను జనం నమ్ముతారని.. లేదంటే నమ్మే అవకాశం లేదన్నారు.
గత మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను కేసీఆర్ విస్మరించారని రేవంత్ గుర్తుచేశారు. ఇవే హామీలను తిరగరాసి.. చెబుతున్నారని మండిపడ్డారు. కేసీఆర్ బుడబుడకల మాటలను ప్రజలు నమ్మారని రేవంత్ అంటున్నారు. కాంగ్రెస్ అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తే.. కేసీఆర్ మీడియా ముందుకు వచ్చారని పేర్కొన్నారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను చిన్నా భిన్నం చేసి.. చేష్టలుడిగిన కేసీఆర్ ఈ రోజు కనిపించారని విమర్శించారు. ఎన్నికల బరి నుంచి తప్పుకోవాలని కేసీఆర్ను రేవంత్ సూచించారు. ఇప్పటివరకు గతాన్ని చూసి నమస్కారం పెట్టే అవకాశం ఉందని.. లేదంటే ఆ పరిస్థితి లేదన్నారు. శేష జీవితాన్ని విశ్రాంతి తీసుకోవాలని కోరారు.
కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలను చూసి బీఆర్ఎస్ పార్టీకి దిమ్మతిరిగి మైండ్ బ్లాంక్ అయ్యిందని రేవంత్ అన్నారు. వెంటనే ఆయనకు చలి జ్వరం వచ్చిందన్నారు. ఇతర పార్టీల మేనిఫెస్టోలను కాపీ కొట్టారని విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన హామీలనే వెయ్యి పెంచుతూ కేసీఆర్ కాపీ కొట్టారని వివరించారు. సొంతంగా ఆలోచించే శక్తిని కేసీఆర్ కోల్పోయారని.. పరాన్నజీవిగా మారిపోయారని తెలిపారు. కాంగ్రెస్ ప్రకటించిన హామీలు అసాధ్యం అని చెప్పి.. ఇప్పుడు మేనిఫెస్టోలో ఎలా పెడతారని అడిగారు. కాంగ్రెస్ హామీ చూసి సౌభాగ్య లక్ష్మీ ప్రకటించారని, గుర్తుచేశారు.