Revanth నియంతలా వ్యవహరిస్తున్నారు.. పార్టీలో నీ పెద్దరికం ఏందీ: రాగిడి లక్ష్మారెడ్డి
తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి నియంతలా వ్యవహరిస్తున్నారని రాగిడి లక్ష్మారెడ్డి విరుచుకుపడ్డారు. ఉప్పల్లో కాంగ్రెస్ పార్టీ కోసం 25 ఏళ్లు కష్టపడి పనిచేసిన తనకు టికెట్ ఇవ్వలేదని మండిపడ్డారు.
టికెట్ దక్కలేదని తెలిసి లక్ష్మారెడ్డి బాధ పడ్డారు. కన్నీరు పెట్టుకున్నారు. రేవంత్ నియంతలా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. ఉప్పల్ నియోజకవర్గంలో గత 25 ఏళ్ల నుంచి పనిచేస్తున్నానని గుర్తుచేశారు. ఇక్కడ పడిపోయిన పార్టీని లేపానని తెలిపారు. తాను ఏం చేశానో ఇక్కడి ప్రజలను అడగాలని కోరారు. నీకు దండం పెట్టి, సెల్యూట్ చేసే వారిని నమ్ముతావా..? అంటూ విరుచుకుపడ్డారు. మోసం చేసే వాళ్లను మోసగాళ్లు నమ్ముతారని మండిపడ్డారు. ఎప్పుడూ వచ్చావ్ పార్టీలోకి.. ఇక్కడ నీ పెద్దరికం ఏంటీ అని ఫైరయ్యారు. సీనియర్లు అంటే లెక్కలేదు.. ఎందుకు వారిపై కోపమో అర్థం కావడం లేదన్నారు.
తన ఉసురు తాకుతుందని శాపనార్థలు పెట్టారు. తాను రాడికల్ స్టూడెంట్ యూనియన్ నుంచి వచ్చానని గుర్తుచేశారు. పీసీసీ చీఫ్ పదవీ చేపట్టావని గౌరవించానని.. తనకంటే చిన్నవాడు అయినా సరే అన్నా అని పిలిచినా తనకు అన్యాయం చేశారని తెలిపారు. పార్టీకి రాజీనామా చేశానని తెలిపారు. రాజీనామా లేఖను మల్లికార్జున ఖర్గేతోపాటు సోనియాగాంధీ, రాహుల్ గాంధీకి పంపించానని తెలిపారు.
తొత్తులుగా ఉన్నా వారికి రేవంత్ రెడ్డి టికెట్లు కేటాయించారని లక్ష్మారెడ్డి ఆరోపించారు. డబ్బులు ఇచ్చిన వారికి టికెట్ పక్కా అన్నారు. టీడీపీ నుంచి వచ్చిన వారిని అందలం ఎక్కించారని విరుచుకుపడ్డారు. ఇటీవల వచ్చిన ఆరోపణలు నిజమేనని.. డబ్బులు, భూమి రిజిస్ట్రేషన్ చేసుకొని టికెట్లు ఇచ్చారని స్పష్టంచేశారు.