ఆసియా కప్ భారత్(India), పాకిస్తాన్ మధ్య జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. భారత ఇన్నింగ్స్ తర్వాత వర్షం మొదలైంది. ఎంతకూ తగ్గకపోవడంతో మ్యాచ్‌ని రద్దు చేస్తున్నట్లు ఫీల్డ్ అంపైర్లు (umpires) ప్రకటించారు. దీంతో ఇరుజట్లకు చెరో పాయింట్ దక్కింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇండియా 266 రన్స్ చేసిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ లో టీమిండియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. 48.5 ఓవర్లలో 266 పరుగులకు ఆలౌట్ అయింది.
ఇషాన్ కిషన్ (Ishan Kishan) (82), హార్దిక్ పాండ్యా (87) క్రీజులో ఉన్నంత సేపు టీమిండియా స్కోరు 300 దాటడం ఖాయం అనిపించింది. ఇషాన్ కిషన్ అవుటయ్యాక పాండ్యా కాసేపు దూకుడుగా ఆడినా, షహీన్ అఫ్రిది ఒకే ఓవర్లో రెండు వికెట్లు తీసి భారత్ భారీ స్కోరు ఆశలకు కళ్లెం వేశాడు. ఎంతో కీలకమైన హార్దిక్ పాండ్యా(Hardik Pandya), జడేజాలను పెవిలియన్ కు తిప్పి పంపాడు.చివర్లో నసీమ్ షా ఒకే ఓవర్లో 2 వికెట్లు తీయడంతో టీమిండియా ఇన్నింగ్స్ ముగిసింది. ఆఖర్లో జస్ప్రీత్ బుమ్రా 14 బంతుల్లో 3 ఫోర్లతో 16 పరుగులు సాధించాడు. పాక్ బౌలర్లలో షహీన్ అఫ్రిది (Shaheen Afridi) 4, నసీమ్ షా 3, హరీస్ రవూఫ్ 3 వికెట్లు తీశారు.