రాజకీయ నాయకులు ఇచ్చిన మాట మీద నిలబడటమే కష్టం… అలాంటిది ఓ మంత్రి రోడ్లు బాగా లేనందుకు ఏకంగా సామాన్యుడి పాదాలు కడిగి క్షమాపణలు చెప్పిన సంఘటన మధ్యప్రదేశ్లోని గ్వాలియర్ నగరంలో చోటు చేసుకుంది. వినయ్ నగర్ ప్రాంతంలోని రోడ్డు అధ్వాన్నంగా మారడంతో ఇంధన శాఖ మంత్రి ప్రధుమన్ సింగ్ తోమర్ కాళ్లు కడిగి, పశ్చాత్తాపం ప్రకటించారు. డ్రైనేజీ లీక్ అయి, రోడ్లన్నీ అధ్వాన్నంగా తయారయ్యాయి. అంతా బురదమయం అయింది. స్థానిక నివాసి సౌరబ్ కాళ్లు మొత్తం బురదలా మారింది. అదే సమయంలో మంత్రి తోమర్ కాలనీలో ఇన్స్పెక్షన్ కోసం వచ్చారు.
కాలనీవాసులు తమ సమస్యను చెప్పారు. అలాగే సౌరబ్ కాళ్ళను చూసిన మంత్రి వెంటనే ఒక బక్కెట్ నీళ్లు తెప్పించుకొని, అతని కాళ్లను కడిగాడు. తోమర్ ఎప్పుడు కూడా తన పనితనంతో వార్తల్లో నిలుస్తుంటారు. అతను గతంలో టాయ్లెట్స్ శుభ్రం చేశాడు… ఎలక్ట్రిసిటీ పోల్స్ బాగు చేశాడు… రోడ్లను ఊడ్చాడు. ఇప్పుడు యువకుడి కాళ్లు కడిగాడు.
రోడ్డు దుస్థితికి తాను ప్రజలకు క్షమాపణలు చెపుతున్నానని, మురుగునీటి పైప్లైన్ పనికోసం తవ్విన రోడ్డును బాగు చేస్తానని తోమర్ హామీ ఇచ్చారు. ప్రజలకు సరైన రోడ్లు ఇవ్వడం ప్రభుత్వం బాధ్యత అని కూడా వ్యాఖ్యానించారు. రోడ్ల ఈ పరిస్థితికి కారణమైన అధికారులపై చర్యలు తీసుకుంటామన్నారు. ప్రధుమాన్ సింగ్ తోమర్ గ్వాలియర్ నుండి బీజేపీ ఎమ్మెల్యేగా గెలిచారు. అధ్వాన్న పరిస్థితుల్లో ఉన్న రోడ్లకు సంబంధించి అక్టోబర్ నెలలోనే ఫిర్యాదులు స్వీకరించారు.