Posani Krishnamurali: నారా లోకేష్ నుంచి ప్రాణ హాని ఉంది : పోసాని
తనకు ప్రాణహాని ఉందని, అది కూడా టీడీపీ నేత నారా లోకేష్ నుంచేనని వైసీపీ నేత పోసాని కృష్ణమురళి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఏపీ డీజీపీకి ఆయన ఫిర్యాదు చేశారు.
టీడీపీ(TDP) నేత నారా లోకేష్ (Nara Lokesh) వల్ల తనకు ప్రాణహాని ఉందని వైసీపీ నేత పోసాని కృష్ణమురళి (Posani krishnamurali) అన్నారు. తన ప్రాణహాని ఉందని ఆయన ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. తనను చంపేందుకు నారా లోకేష్ కుట్ర చేస్తున్నట్లు తనకు సమాచారం అందిందన్నారు. వెంటనే తనకు రక్షణ కల్పించాలని డీజీపీకి విన్నవించారు.
డీజీపీతో భేటీ అనంతరం మీడియాతో పోసాని మాట్లాడారు. తనకు భద్రత కల్పిస్తానని డీజీపీ హామీ ఇచ్చినట్లు వెల్లడించారు. గతంలో తనను టీడీపీలో చేరాలని లోకేష్ అడిగితే తాను చేరలేదని, అందుకే లోకేష్ ఈగో హర్ట్ అయ్యిందని పోసాని తెలిపారు. తన హత్యకు కుట్ర జరుగుతున్నట్లు కొందరు తనతో చెప్పారన్నారు. అందుకే అలర్ట్ అయ్యి తాను డీజీపీకి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.
లోకేష్ బండారాన్ని బయటపెట్టింది తానేనని, అందుకే తనను టార్గెట్ చేస్తున్నారని పోసాని కృష్ణమురళి అన్నారు. తనన బట్టలూడదీసి కొడతానని లోకేష్ అంటుంటాడని చెప్పారు. చంద్రాబాబుకు సీఎం పదవిపై మోజులేదని చెప్పారని, అలాంటప్పుడు పవన్ కళ్యాణ్‌ను సీఎం చేస్తానని ఎందుకు చెప్పడం లేదని ప్రశ్నించారు. తనకు జగన్ అంటే అభిమానమని అన్నారు.