వేంకటేశ్వర స్వామిని అవమానిస్తే మాత్రం పుట్టగతులుండవని బీజేపీ (BJP) జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ (Bandi sanjay) ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ పాలిటిక్స్‌పై ఆయన ఫుల్ ఫోకస్ పెట్టారు. సీఎం జగన్ (Cm Jagan), వైసీపీ (YCP) నాయకులపై గత కొన్ని రోజుల నుంచి బండి సంజయ్ విమర్శలు గుప్పిస్తూ వస్తున్నారు. తాజాగా మరోసారి జగన్ సర్కార్‌పై బండి సంజయ్ మండిపడ్డారు. ఏపీలోని విజయవాడలో ‘ఓటర్ చేతన్ మహాభియాన్’ కార్యక్రమంలో ఆయన వర్చువల్‌గా ప్రసంగించారు.
ఏపీ (Andhrapradesh)లో హిందూ మతంపై పెద్దఎత్తున దాడి జరుగుతోందన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం భక్తుల్లో అడుగడుగునా ఆందోళన సృష్టిస్తున్నారని, తిరుమలకు భక్తులను రాకుండా చేస్తున్నారని మండిపడ్డారు. భక్తులను కాపాడలేక కర్రలిస్తారా? అని టీటీడీ(TTD)పై ఆగ్రహం వ్యక్తం చేశారు. టీటీడీ ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన భూమన కరుణాకర్ రెడ్డిపై బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. టీటీడీ ఛైర్మన్ తన బిడ్డ పెళ్లిని క్రైస్తవ ఆచార పద్ధతిలో చేశారని, గతంలో ఆయన నాస్తికుడని చెప్పుకున్నట్లు గుర్తుచేశారు. ఆయన రాడికల్ కాదా అని ప్రశ్నించారు.
పీఎం నరేంద్ర మోదీ (PM Modi) నాయకత్వంపై తనకు నమ్మకం ఉందని, ఆ నమ్మకంతోనే పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఎన్టీఏలో చేరారన్నారు. ప్రజా సమస్యలపై పవన్ జనంలోకి వెళ్తుంటే ఆయనను అడ్డుకునే ప్రయత్నం చేస్తుండటం దారుణమన్నారు. అప్పట్లో దొంగ పాదయాత్ర చేసి జగన్ అధికారంలోకి వచ్చారని, నేడు నారా లోకేష్ నిజమైన పాదయాత్ర చేస్తూ ప్రజలకు దగ్గరవుతుంటే ప్రతిపక్ష పార్టీలు ఓర్వలేక కుట్రలు చేస్తున్నాయన్నారు.
ఏపీ (Andhrapradesh), తెలంగాణ (Telangana) విడిపోయినా కూడా మనస్పర్ధలు లేకుండా ప్రజలు బతుకుతున్నారని, అయితే రెండు రాష్ట్రాల సీఎంలు మాత్రం ఆ విషయంలో దాగుడు మూతలు ఆడుకుంటున్నాయన్నారు. మళ్లీ అధికారంలోకి రావడం కోసం ప్రాంతీయ విద్వేషాలను రగిలించే కుట్ర చేస్తున్నాయన్నారు. హిందూ దేవాలయాలపై దాడులు చేస్తున్నా, దేవతా విగ్రహాలను ధ్వంసం చేస్తున్నా వైసీపీ సర్కార్ ఒక్క మతానికే కొమ్ముకాస్తోందన్నారు. అలాంటి పార్టీలకు అధికారాన్ని కట్టబెట్టొద్దని బండి సంజయ్ సూచించారు.