విభజన అంశాలపై ఇష్టారీతిన మాట్లాడితే ఇరుకున పడతామని బీఆర్ఎస్ ఆందోళన చెందుతుందా?
జాతీయ రాజకీయాల్లోకి ఇప్పుడిప్పుడే అడుగులు వేస్తున్న తరుణంలో సెన్సిటివ్ అంశాల జోలికి వెళ్లవద్దని పార్టీ నేతలకు అధిష్టానం సూచిస్తోందా?
అంటే అవుననే వాదనలు వినిపిస్తున్నాయి. ఇటీవల తిరుమల శ్రీవారి దర్శనం అనంతరం మంత్రి మల్లారెడ్డి చేసిన వ్యాఖ్యలు పార్టీ అగ్రనాయకత్వానికి తీవ్ర ఆగ్రహం తెప్పించినట్లుగా తెలుస్తోంది. పలువురు తోటి మంత్రులతో కలిసి ఆయన రెండు రోజుల క్రితం తిరుమల శ్రీనివాసుడి దర్శనం చేసుకున్నారు. దర్శనం అనంతరం ఆయన మాట్లాడుతూ… ఏపీకి ఇప్పటి వరకు ప్రత్యేక హోదా రాలేదని, అలాగే పోలవరం ప్రాజెక్టు పూర్తి కాలేదన్నారు. తమ ముఖ్యమంత్రి కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేసి చూపించారని, ఏపీలో తాము 175 స్థానాల్లో పోటీ చేస్తామని, అధికారంలోకి వస్తే పోలవరం ప్రాజెక్టును వేగవంతంగా పూర్తి చేస్తామన్నారు.
మల్లారెడ్డి చేసిన ఈ వ్యాఖ్యల పట్ల సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే ఆయన జిల్లాకు చెందిన పార్టీ శాసన సభ్యులు ఆయన తీరు పట్ల అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. మరోవైపు ఆయన ఇళ్లు, కాలేజీలలో సోదాలు నిర్వహించారు. ఇలా వరుస షాక్‌ల నేపథ్యంలో ఇప్పుడు అంతకుమించిన సెన్సిటివ్ అంశాల జోలికి వెళ్లడాన్ని పార్టీ అధిష్టానం ఏమాత్రం జీర్ణించుకోవడం లేదని తెలుస్తోంది. మరోసారి ఇలాంటి వ్యాఖ్యలు చేయవద్దని కేసీఆర్, కేటీఆర్… ఇరువురు హెచ్చరించినట్లుగా తెలుస్తోంది.
మల్లారెడ్డితో పాటు నేతలకు తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న విభజన అంశాలు, ఇతర సెన్సిటివ్ విషయాల మధ్య మాట్లాడకూడదని హెచ్చరించినట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే ఇటు తెలంగాణ, అటు ఆంధ్రప్రదేశ్‌లోని పార్టీలు బీఆర్ఎస్ జాతీయ పార్టీగా అవతరించిన నేపథ్యంలో ఏపీకి ఏం చేస్తుంది, తెలంగాణకు ఎలా న్యాయం చేస్తుందనే ప్రశ్నలను సంధిస్తున్నాయి. విభజన జరిగినప్పటి నుండి పోలవరం ప్రాజెక్టును ఎందుకు వ్యతిరేకిస్తున్నారని ఏపీలోని పార్టీలు ప్రశ్నిస్తున్నాయి. పోలవరం ఎత్తు పెంచడంపై సుప్రీం కోర్టుకు వెళ్లింది బీఆర్ఎస్. ఇటీవల మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పోలవరం ప్రాజెక్టు ఎత్తు పెంచితే భద్రాచలం ప్రాంతం ముంపుకు గురవుతుందని, కాబట్టి ఎత్తు తగ్గించాలని డిమాండ్ చేశారు. అలాగే, షెడ్యూల్ 9, 10 ఇనిస్టిట్యూషన్స్‌కు సంబంధించిన ఆస్తుల పంపకం, కృష్ణా, గోదావరి నీటి పంపకం, విద్యుత్ బకాయిలు వంటి ఎన్నో కీలక అంశాలు తెలుగు రాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా ఉన్నాయి.
ఇలాంటి అంశాలను మనమే మాట్లాడితే మొదటికే మోసం వస్తుందని అధిష్టానం అసహనం వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది. లోకసభ ఎన్నికల కంటే ముందుగానే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు మరో పదకొండు నెలల్లో రానున్నాయని, ఇలాంటి సమయంలో తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న అంశాలను లేవనెత్తి, విపక్షాలకు అవకాశం ఇవ్వవద్దని చెప్పారట. మొత్తానికి జాతీయ పార్టీగా సాటి తెలుగు రాష్ట్రం ఏపీకి వెళ్లితే బీఆర్ఎస్కు వచ్చే చిక్కులు అన్నీ ఇన్నీ లేవు.