PM Modi: నేటి నుంచి ఫ్రాన్స్ లో మోడీ రెండు రోజుల పర్యటన
దేశ ప్రధాని నరేంద్ర మోడీ నేటి నుంచి రెండు రోజుల పాటు ఫ్రాన్స్ దేశంలో పర్యటించనున్నారు. పారిస్ నగరంలో జూలై 14వ తేదీన జరిగే బాస్టిల్ డే పరేడ్‌లో ప్రధాని ప్రత్యేక అతిథిగా హాజరుకానున్నారు. ఈ సందర్భంగా పలు జాతీయ, అంతర్జాతీయ అంశాలపై చర్చలు జరుగనున్నట్లు భారత విదేశాంగ శాఖ అధికారిక ప్రకటనలో వెల్లడించింది.
PM Modi: ప్రధాని నరేంద్ర మోడీ(Prime Minister Narendra Modi) ఫ్రాన్స్(France) పర్యటనకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడింది. నేటి నుంచి రెండు రోజులపాటు ఆ దేశంలో మోడీ పర్యటించనున్నారు. పారిస్ నగరంలో జూలై 14వ తేదీన జరిగే బాస్టిల్ డే పరేడ్(Bastille Day Parade)లో ప్రధాని మోడీ ప్రత్యేక అతిథిగా అహ్వానాన్ని అందుకున్నారు. ప్రధాని మోడీ ఫ్రాన్స్ లో పర్యటించడం ఇది ఐదోసారి. ఈ కవాతులో భారత త్రివిధ దళాల బృందం పాల్గొననుంది. ఈ సందర్భంగా ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్(Emmanuel Macron) మోడీకి ఫ్రాన్స్ అధికార విందుతోపాటు ప్రత్యేక ఆతిథ్య విందు ఇవ్వనున్నారు.
ఈ పర్యటనలో భాగంగా ఇరుదేశాల అగ్రనేతలు విస్తృతస్థాయి అంశాలపై ముచ్చటించనున్నారు. తర్వాత ఫ్రాన్స్ సెనేట్, నేషనల్ అసెంబ్లీ అధ్యక్షులనూ మోడీ కలుస్తారు. ఫ్రాన్స్ పారిశ్రామికవేత్తలు, భారతీయ సీఈవోలు, అక్కడి ప్రముఖులను కలుస్తారు. అనంతరం అక్కడి భారతీయులనుద్దేశించి ప్రసంగిస్తారు. ఇండియా–ఫ్రాన్స్ వ్యూహాత్మక భాగస్వామ్యం 25 ఏళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా ప్రధాని మోదీ పర్యటన రెండు దేశాల భిన్నరంగాల భాగస్వామ్యాన్ని కొత్త పుంతలు తొక్కించనుందని భారత విదేశాంగ శాఖ(Indian Ministry of External Affairs) పేర్కొంది. ఇందులో భాగంగా సాంస్కృతిక, శాస్త్రీయ, విద్య, ఆర్థిక, రక్షణ రంగాల్లో పరస్పర భాగస్వామ్యంపై చర్చించనున్నారు. నేవీ వేరియంట్ 26 రాఫెల్ యుద్ధవిమానాల కొనుగోలుతోపాటు ఇరుదేశాలు సంయుక్తంగా విమాన ఇంజిన్‌ను భారత్‌లో తయారుచేసే ఒప్పందం ఖరారు కావచ్చు అని విదేశాంగ శాఖ కార్యదర్శి వినయ్ ఖ్వాత్రా(Vinay Khwatra) తెలిపారు. ఫ్రాన్స్ గణతంత్ర వేడుకలుగా భావించే బాస్టిల్ డే కవాతులో పాల్గొనేందుకు ఇప్పటికే 269 మంది సభ్యుల త్రివిధ దళ బృందం సీ–17 గ్లోబ్‌మాస్టర్ యుద్ధ సరుకు రవాణా విమానంలో పారిస్‌కు చేరుకుంది. ఛాంప్స్ ఎలీసెస్ చారిత్రక ప్రాంత గగనతలంలో ఫ్రెంచ్ యుద్ధవిమానాలకు తోడు భారత రాఫెల్ ఫైటర్జెట్లు ఫ్లైపాస్ట్‌లో పాల్గొననున్నాయి.
తిరుగు ప్రయాణంలో జూలై 15వ తేదీన ప్రధాని నరేంద్ర మోడీ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(UAE)లో పర్యటించనున్నారు. యూఏఈ అధ్యక్షులు, అబుదాబీ పాలకుడు అయిన షేక్ మొహమ్మద్ బిన్ జయేద్ అల్ నహ్యాన్(Sheikh Mohammed bin Zayed Al Nahyan)తో మోడీ భేటీ కానున్నారు. ఈ సందర్భంగా సంస్కృతి, ఇంధనం, ఆహార భద్రత, రక్షణ, ఫిన్‌టెక్, విద్య, ఆరోగ్య రంగాల్లో ద్వైపాక్షిక ఒప్పందాలను మరింత పటిష్టం చేసుకోవడంపై ఇరు దేశాధినేతలు చర్చించనున్నారు. కాప్–28కు యూఏఈ, జీ20కి భారత్ సారథ్యం వహిస్తున్న తరుణంలో అగ్రనేతలు అంతర్జాతీయ అంశాలపై చర్చించనున్నట్లు భారత విదేశాంగ శాఖ పేర్కొంది.