టమాట ధరలు ఆకాశాన్నంటిన వేళ.. టమాట రైతుల (Tomato farmer) దగ్గర డబ్బులు ఎక్కువ ఉంటాయన్న అనుమానంతో కొందరు దుండగులు దొంగతనానికి పాల్పడుతున్నారు. అడ్డొస్తే అంతమొందించడానికి కూడా వెనకాడట్లేదు. తాజాగా అన్నమయ్య జిల్లామదనపల్లె(Madanapalle)లో ఇలాంటి ఘటనే జరిగింది. ఏపీలో టమాటా రైతు దారుణ హత్యకు గురయ్యాడు. వివరాలలోకి వెళితే, మృతుడు బోడి మల్లెదిన్నెకు చెందిన నారెం రాజశేఖర్ రెడ్డి (Narem Rajasekhar Reddy) ఆయన నిన్న మార్కెట్లో 71 క్రేట్ల టమాటాను తీసుకువచ్చి అమ్మివేశాడు. రాత్రి పాలు పోయడానికి ఊళ్లోకి వెళ్లి వస్తుండగా మధ్యలో అడ్డుకున్న దుండగులు పక్కనే ఉన్న చింతచెట్టు కిందకు లాక్కళ్లి రేషన్ దారంతో చేతులు.. అతని పంచెతోనే కాళ్లు కట్టేసి తువాలు మెడకు బిగించి ఊపిరి ఆడకుండా చేసి చంపేశారు.
రైతు టమాటాలు అమ్మి వచ్చిన డబ్బులు దోచుకోవడానికి వచ్చిన దుండగులు (thugs) అతడిని హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఊరికి దూరంగా అతని ఇల్లు ఉండడం కూడా ఈ దారుణం చేయడానికి సహాయం చేసిందని అంటున్నారు. మొదట ఒకసారి వచ్చి రాజశేఖర్ రెడ్డి ఇంట్లో ఉన్నాడా? అని ఆరా తీశారు దుండగులు. ఆ తరువాత కాసేపటికే అతను మృతి చెందాడు. నిందితులకోసం గాలిస్తున్నారు.రాజశేఖర్ రెడ్డి ఇప్పటికే ఐదు కోతలు టమాటాలు కోసి మార్కెట్లో (market) అమ్మారు. డబ్బులు ఇంట్లో ఉంటే దొంగల భయం, భద్రత ఉండదని అన్ని కోతలు అయిన తర్వాత తీసుకుంటానని మండీ వ్యాపారుల వద్దే ఉంచినట్లు సమాచారం. మంగళవారం కూడా 70 క్రేట్లు(ట్రేలు) టమాటను మార్కెట్లో దించి వచ్చారు. ఆ డబ్బులు వచ్చి ఉంటాయన్న అనుమానంతోనే ఊరికి దూరంగా ఉన్న ఇతన్ని దోచుకోవడానికి వచ్చి ఈ దారుణానికి పాల్పడి ఉంటారని పోలీసులు (Police) అనుమానిస్తున్నారు.