»When Will Elections Be Held For Vacant Local Bodies High Court
Telangana : ఖాళీ స్థానిక సంస్థలకు ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారు : హైకోర్టు
రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉన్న సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ, వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారనేది చెప్పాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది
తెలంగాణ(Telangana)లో ఖాళీగా ఉన్న స్థానిక సంస్థల్లో ఖాళీగా ఉన్న సర్పంచ్, ఉపసర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారని హైకోర్టు (High Court) ప్రశ్నించింది. ఎప్పట్లోగా ఎన్నికలు నిర్వహిస్తారో ఈనెల 28లోగా చెప్పాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఖాళీగా ఉన్న స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలన్న పిల్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. 220 పంచాయతీలు, 94 ఎంపీటీసీ, నాలుగు జెడ్పీటీసీ, 5,364 వార్డులు, 344 ఉపసర్పంచి స్థానాలు ఖాళీగా ఉన్నాయని పిటిషనర్.. ధర్మాసనం దృష్టికి తెచ్చారు. దీనిపై వివరణ ఇవ్వాలని మార్చిలోనే ప్రభుత్వానికి, ఎస్ఈసీకి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఎప్పట్లోగా ఎన్నికలు నిర్వహిస్తారో చెప్పేందుకు ప్రభుత్వం గడువు కోరడంతో విచారణను హైకోర్టు ఈనెల 28కి వాయిదా వేసింది.
స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఖర్చులకు సంబంధించిన అఫిడవిట్(Affidavit)ను దాఖలు చేయకపోవడంతో కొంతమందిపై ఎన్నికల సంఘం అనర్హత వేటు వేసింది. ఇక అవిశ్వాస తీర్మానాల వల్ల మరికొంతమంది తమ పదవులకు రాజీనామాలు చేయగా.. వివిధ కారణాలతో పలువురు రాజీనామా చేశారు.ఖాళీ అయి దాదాపు మూడేళ్లు అవుతున్నా ఎన్నికలపై అధికారులు దృష్టి పెట్టలేదు. దీని వల్ల గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలు ఆగిపోయాయని కోందరు హైకోర్టును ఆశ్రయించారు. ప్రజలకు ఏమైనా సమస్యలు ఉంటే తొలుత స్థానికంగా ఉండే సర్పంచ్(Sarpanch), ఎంపీటీసీలకు చెప్పుకుంటారు. అలాగే గ్రామంలోని సమస్యలు స్థానికంగా ఉండే సర్పంచ్, ఎంపీటీసీలకు వెంటనే తెలుస్తాయి. చాలా స్థానాలు ఖాళీగా ఉండటం వల్ల ప్రజలు తమ సమస్యలు ఎవరికీ చెప్పుకోవాలో తెలియని పరిస్థితి ఏర్పడింది.