కాపు సామాజిక వర్గానికి చెందిన నేత తోట చంద్రశేఖర సోమవారం బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. ఆయనకు ఆంధ్రప్రదేశ్ పార్టీ అధ్యక్ష బాధ్యతలను అప్పగిస్తారని వార్తలు వచ్చాయి. రాజకీయాల్లోకి వచ్చిన కొద్ది సంవత్సరాల్లోనే పలు పార్టీలు మారిన ఆయన… ఆంధ్రప్రదేశ్‌లో ప్రభావం చూపే అవకాశం తక్కువేనని భావిస్తున్న బీఆర్ఎస్ పార్టీలో నిలకడగా ఉండగలుగుతారా? కాపు సామాజిక వర్గంలో ఎంత పట్టు ఉంది? అధికారిగా తప్ప, రాజకీయాల్లో సమర్థత నిరూపించుకున్న దాఖలాలు ఎక్కడ? అలాంటి నేతకు అధ్యక్ష బాధ్యతలు అప్పగిస్తే బీఆర్ఎస్ పుంజుకుంటుందా? ఏపీకి చెందిన ఇతర కీలక నేతలను ఆయన పార్టీలోకి తీసుకురాగలరా? అంటే కాలమే సమాధానం చెబుతుంది.
తెలంగాణతో పాటు వివిధ రాష్ట్రాల్లో పోటీ చేయాలని భావిస్తున్న కేసీఆర్, తొలుత కర్నాటక, ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. ఏపీలో త్వరలో పర్యటించాలని, కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని, తన పర్యటనలో పెద్ద ఎత్తున ఏపీ నాయకులను పార్టీలో చేర్చుకోవాలని భావిస్తున్నారు. తోట చంద్రశేఖర్‌తో పాటు రావెల కిషోర్ బాబు వంటి నేతలు కారెక్కారు. వీరు ఏపీలో పలువురు నాయకులను పార్టీలోకి తీసుకు వచ్చే ప్రయత్నాలు ముమ్మరం చేయనున్నారు. కేసీఆర్ ఏపీలోకి ఎంటర్ కాకముందే అక్కడి పార్టీల నుండి ప్రశ్నల వర్షం కురుస్తోంది. కేసీఆర్ పార్టీ పెట్టుకోవచ్చునని, ఎక్కడైనా పోటీ చేయవచ్చునని చెబుతూనే, అసలు ఆయనను ఏపీ ప్రజలు ఎలా అంగీకరిస్తారని ప్రశ్నిస్తున్నారు. ఉద్యమం సమయంలో అన్న మాటలు, విభజన తర్వాత ఏపీకి రావాల్సిన నిధులు సహా ఎన్నో అంశాలపై బీఆర్ఎస్ సమాధానం చెప్పాలని నిలదీస్తున్నారు.
ఒకవిధంగా చెప్పాలంటే బీఆర్ఎస్ కర్నాటక సహా ఇతర తెలుగేతర రాష్ట్రాలలోకి వెళ్లినంత సులభంగా ఆంధ్రప్రదేశ్‌లోకి వెళ్లలేదని అంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తోట చంద్రశేఖరకు ఏపీ బాధ్యతలు అప్పగిస్తున్నారు. ఆయన రాజకీయాల్లోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే పలు పార్టీలు మారారు. 13 ఏళ్ల క్రితం ఆయన పొలిటికల్ ఎంట్రీ జరిగింది. మహారాష్ట్ర కేడర్ ఐఏఎస్‌గా ఇరవై మూడేళ్ల పాటు పని చేసిన చంద్రశేఖర్ ఆ పదవికి రాజీనామా చేసి, చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ నుండి గుంటూరు లోకసభకు పోటీ చేసి, ఓడిపోయారు. ఆ తర్వాత జగన్ స్థాపించిన వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. 2014లో ఏలూరు లోకసభకు పోటీ చేసినా ఫలితం దక్కలేదు. ఆ తర్వాత 2019కి ముందు జనసేనలో చేరి గుంటూరు వెస్ట్ నుండి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ఏపీలో కాపు సామాజిక వర్గం బలమైనది. అందుకే కేసీఆర్ ఆయనను ఎంచుకున్నారు. కానీ పవన్ కళ్యాణ్‌ను కాదని రాజకీయంగా వ్యక్తిగతంగా ఏమాత్రం బలం లేని చంద్రశేఖర్‌తో బీఆర్ఎస్కు చేకూరే లాభమేమిటో ఎన్నికలు వస్తే కానీ తెలియదు.