నెల్లూరు జిల్లా కందుకూరులో చంద్రబాబు నిర్వహించిన సభలో అపశృతి చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఘటనలో తొక్కిసలాట కారణంగా 8మంది కార్యకర్తలు దురదృష్టవశాత్తు ప్రాణాలు కోల్పోయారు. కాగా… వారి మృతదేహాలకు ఈరోజు ఉదయం ఆరు గంటల నుండి పోస్ట్మార్టం మొదలు పెట్టి పూర్తి చేశారు. ప్రత్యేక వైద్య బృందాల నేతృత్వంలో పోస్ట్మార్టం జరిగింది. ఇప్పటికే మృతి చెందిన వారి బంధువులు ఏరియా వైద్యశాలకు చేరుకొని ఆందోళన చేస్తున్నారు. అధికారులు వారికి సర్ధిచెప్పి, మృతదేహాలతో పాటు వారిని ప్రత్యేక అంబులెన్స్ ద్వారా సొంత గ్రామాలకు తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే, ఈ దుర్ఘటనపై పోలీసులు కేసులు నమోదు చేశారు. సెక్షన్ 174 కింద ఎఫ్ఐఆర్ను నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అనుమానాస్పద మృతి కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు పేర్కొన్నారు.
కాగా… ఈ ఘటనపై ప్రధాని నరేంద్రమోదీ కూడా స్పందించారు. ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలిపారు. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షలు, క్షతగాత్రులకు రూ. 50 వేల చొప్పున క్స్గ్రేషియా ప్రకటించారు. ఈ మేరకు పీఎంవో ట్విట్టర్లో పోస్టు చేసింది.
‘‘ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నెల్లూరు బహిరంగ సభలో జరిగిన దుర్ఘటనవల్ల తీవ్రంగా కలత చెందాను. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నాను. పీఎంఎన్ఆర్ఎఫ్ నుంచి మృతుల కుటుంబసభ్యులకు రూ.2 లక్షలు,క్షతగాత్రులకు రూ. 50,000 చొప్పున ఎక్స్ గ్రేషియా మంజూరు చేస్తాం’’ అని మోదీ పేర్కొన్నారు.