2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు కొత్త తలనొప్పి వచ్చి పడిందా? పదవుల అంశం ఆయనను చిక్కుల్లో పడేస్తుందా? ఎంతమంది ఆశావహులను సంతృప్తి పరుస్తారు, పదవి రానివారు పక్కకు వెళ్లకుండా వారిని బుజ్జగించే పరిస్థితి పార్టీలో నెలకొన్నదా? ఇదంతా ఎందుకు అంటున్నారా? 2023 అసెంబ్లీ ఎన్నికలకు తెలంగాణలో 7 ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అవుతున్నాయి. ఈ స్థానాలను భర్తీ చేసే క్రమంలో పదుల సంఖ్యలో హామీ ఇచ్చినందున ఎవరికి అవకాశం దక్కుతుంది, ఈ పదవులపై ఆశలు పెట్టుకున్న వారు కేసీఆర్ వెంటనే నడుస్తారా? లేక షాకిస్తూ ఇతర పార్టీల వైపు చూస్తారా? అంటే వేచి చూడాల్సిందే.
2023లో ఏడు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అవుతున్నాయి. ఇందులో ఎమ్మెల్యే కోటాలో రెండు, గవర్నర్ కోటాలోరెండు, టీచర్ల కోటా, హైదరాబాద్ లోకల్ బాడీ కోటాలో ఒక్కొక్కటి చొప్పున రెండు స్థానాలు ఖాళీ అవుతున్నాయి. మొత్తం ఏడు స్థానాల్లో కొత్త వారికి అవకాశం ఇస్తారా, పాతవారిలో ఎందరిని తిరిగి అవకాశం వస్తుందనేది చూడాలి. అయితే ఈ ఎమ్మెల్సీ స్థానాలపై పదుల సంఖ్యలో నాయకులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఇటీవల మునుగోడు ఉప ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ (టీఆర్ఎస్) పార్టీ తీర్థం పుచ్చుకున్న దాసోజు శ్రవణ్, స్వామి గౌడ్ పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. శ్రవణ్ అంతకుముందు కాంగ్రెస్లో ఉన్నారు. మునుగోడు ఉప ఎన్నికలకు కొద్ది నెలల ముందు బీజేపీలో చేరారు. అయితే కొద్ది రోజుల్లోనే తిరిగి బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. ఎమ్మెల్సీ పదవి హామీతోనే పార్టీలో చేరారనే ప్రచారం సాగుతోంది. స్వామిగౌడ్కు కూడా అదే హామీ ఇచ్చారని తెలుస్తోంది.
2018 ఎన్నికల్లో టిక్కెట్ రాని చాలామంది నేతలకు కూడా కేసీఆర్ హామీ ఇచ్చారని, ఎమ్మెల్సీపై ఆశలు పెట్టుకొని ఇప్పటికీ కొనసాగుతున్న వారు ఎందరో ఉన్నారు. గత ఎన్నికల తర్వాత కేసీఆర్, కేటీఆర్ చాలామంది నేతలకు హామీ ఇచ్చారు. మునుగోడు ఉప ఎన్నికలకు ముందు దాసోజు శ్రవణ్, స్వామిగౌడ్, బూడిద భిక్షమయ్య గౌడ్, పల్లె రవి, అంతకుముందు రాపోలు ఆనంద భాస్కర్, జూపల్లి, తుమ్మల, పొంగులేటి వంటి ఎంతోమంది నేతలు వరుసలో ఉన్నారు. ఏడు సీట్లకు గాను బీఆర్ఎస్లో ఆశావహులు ఏడురెట్లు ఉన్నారు. ఒక్కో ఎమ్మెల్సీ పదవికి పదుల సంఖ్యలో పోటీ నెలకొని ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో కేసీఆర్ ఎలా సర్దుబాటు చేస్తారనే ప్రశ్న ఉత్పన్నం అవుతుంది. పైగా 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇది పార్టీ అధినేతకు ఇబ్బందికరంగా మారిందని అంటున్నారు. ఎందుకంటే ఇటు ఎమ్మెల్సీ రాక, అటు టిక్కెట్ పైన హామీ రాని వారు గోడ దూకే అవకాశాలు ఉంటాయి.
వచ్చే ఏడాదిలో ఖాళీ కానున్న ఈ ఏడు ఎమ్మెల్సీ స్థానాల్లో ఇప్పటికే నాలుగైదు సీట్లు ఖరారు అయినట్లుగా కూడా తెలుస్తోంది. అయితే ఈ ఐదింటిలో ఒకటి మిత్రపక్షం మజ్లిస్ పార్టీకి వెళ్తుంది. పార్టీ నుండి ముగ్గురు, నలుగురు ఖరారయ్యారని వార్తలు వస్తున్నాయి. ఇక మిగిలేది రెండు మూడు సీట్లు మాత్రమే. కాబట్టి ఇందులో దాసోజు, స్వామిగౌడ్, రాపోలు, పల్లెలలో ఎవరికి అవకాశం దక్కుతుందా, లేదా వీరిని పక్కన పెట్టి మరొకరికి అవకాశం వస్తుందా? చూడాలి.