టీ కాంగ్రెస్ లో గొడవలు సద్దుమణిగించడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా… ఫలితం ఉండటం లేదు. ఇటీవల పార్టీ సీనియర్ నేతలంతా సేవ్ కాంగ్రెస్ అంటూ ఉద్యమం మొదలుపెట్టగా… దిగ్విజయ్ సింగ్ రంగంలోకి దిగి పరిస్థితి చక్కపెట్టారు. అయితే… ఆయన అలా మళ్లీ ఢిల్లీ చేరారో లేదో.. మళ్లీ పంచాయతీ మొదలైంది.
దిగ్విజయ్ సింగ్ సీనియర్ నాయకులతో మాట్లాడి.. కలిసి కట్టుగా ఉండాలని చెప్పినప్పటికీ పదవుల పంచాయితీ నివురుగప్పిన నిప్పులా అలాగే రాజుకుంటుంది. తాజాగా కొండా సురేఖ దిగ్విజయ్ సింగ్‌కు లేఖ రాశారు. తనకు పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ లేదా ఏఐసీసీ సెక్రటరీ పదవి ఇవ్వాలని లేఖలో దిగ్విజయ్‌ను కోరారు. ఈ మేరకు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, దిగ్విజయ్ సింగ్‌లకు విజ్ఞప్తి చేశారు. తనను పీఈసీ సభ్యురాలిగాఎంపిక చేసినందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నానని చెప్పారు.
కొన్నేళ్లుగా రాజకీయ అనుభవం కలిగిన తనను ఏఐసీసీ కార్యదర్శిగా లేదా పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమించాలని విజ్ఞప్తి చేశారు. ఈ విషయాన్ని ఇప్పటికే పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని కూడా అడిగినట్లు లేఖలో పేర్కొన్నారు. రాజకీయాల్లో తనకు దాదాపు 3 దశాబ్దాల అనుభవం ఉందని దిగ్విజయ్ సింగ్‌కు రాసిన లేఖలో కొండా సురేఖ ప్రస్తావించారు. మహిళా సాధికారత సాధించేందుకు తనకు అన్ని నైపుణ్యాలు ఉన్నాయన్నారు. టీపీసీసీలోని మహిళలు దేశంలో ప్రత్యేకంగా ఉండేలా చేస్తానని హామీ ఇచ్చారు.ఈ పదవుల్లో ఏది ఇచ్చినా.. వంద శాతం వాటికి న్యాయం చేస్తానని వాగ్దానం చేస్తున్నట్లు తెలిపారు.