»Today Marks Four Years Of Ysrcp Government Rule May 30th 2023
YSRCP ప్రభుత్వ పాలనకు నేటితో నాలుగేళ్లు
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి(ys jagan mohan reddy) ప్రభుత్వం అధికారం చేపట్టి నేటితో నాలుగేళ్లు. ఈ సందర్భంగా ఏపీలో జగన్ ప్రభుత్వం చేసిన కార్యక్రమాల గురించి ఇప్పుడు చుద్దాం.
ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి(ys jagan mohan reddy) వైఎస్సార్సీపీ(YSRCP) ప్రభుత్వం ఏర్పాటై నేటితో నాలుగేళ్లు. మే 30, 2019న వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాష్ట్ర సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ క్రమంలో తన ఎన్నికల వాగ్దానాలను నాలుగు సంవత్సరాలలో దాదాపు 98.5% పైగా నెరవేర్చారని వైసీపీ నేతలు చెబుతున్నారు. పేదలు, నిరుపేదలకు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నట్లు వెల్లడించారు. గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థతో అట్టడుగు స్థాయి వరకు పరిపాలన అందిస్తున్నామని వెల్లడించారు. ఈ నేపథ్యంలో మధ్యవర్తుల వ్యవస్థను కూల్చివేసి అవినీతిని తరిమికొట్టే ప్రత్యక్ష ప్రయోజనాల బదిలీతో నాలుగేళ్లలో రాష్ట్రం అపారమైన ప్రగతిని సాధించిందని అంటున్నారు.
దీంతోపాటు సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చొరవతో పెద్ద కంపెనీల పెట్టుబడులు కూడా ఏపీ(AP) రాష్ట్రానికి పెద్ద ఎత్తున వచ్చాయని పేర్కొన్నారు. గ్రీన్ ఎనర్జీ, మౌలిక సదుపాయాలు, సేవలపై ఆసక్తిని కనబరుస్తున్న భారతీయ కార్పొరేట్ కంపెనీలు ఆంధ్రప్రదేశ్ రాష్టానికి వచ్చినట్లు వెల్లడించారు. ఏపీ ఆర్థిక ప్రగతిలో భాగంగా అమ్మ ఒడి నుంచి విద్యా దేవేన, వసతి దేవేన, చేయూత, ఆసరా..ఇలా నాలుగేళ్లుగా మహిళా సాధికారత, సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాలే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రత్యేక పథకాలుగా ఉన్నాయని ప్రకటించారు. అధికార వికేంద్రీకరణ ఎజెండాను కొనసాగిస్తూనే ప్రభుత్వం జిల్లాల సంఖ్యను 26కి పెంచింది. ప్రభుత్వ పథకాలను మరింత సమర్థవంతంగా అందించేందుకు గ్రామ, వార్డు సచివాలయాల ఏర్పాటుతో పాటు వైఎస్ఆర్, ఎన్టీఆర్, అన్నమయ్య, అల్లూరి సీతారామరాజు వంటి ప్రముఖుల పేర్లను జిల్లాలకు పెట్టింది.
రైతు భరోసా కేంద్రాలు, విత్తనాల నుంచి ఉత్పత్తుల అమ్మకం వరకు రైతుల(farmers)కు అన్ని అవసరాలను పంపిణీ చేయడం, YSR క్లినిక్‌లు, ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్, ఇంగ్లీష్ మీడియం పాఠశాలలు ప్రభుత్వం తీసుకున్న ఇతర చర్యలతో పాటు గ్రామీణ దృశ్యాన్ని మార్చాయని అంటున్నారు. ప్రభుత్వం పారిశ్రామిక వృద్ధికి సమాన ప్రాధాన్యతనిచ్చింది. ఫలితంగా 89 SEZలు వచ్చాయి, వాటిలో 24 పని ప్రారంభించాయి. 33 అధికారికంగా ఆమోదించబడ్డాయి. రంగాల వారీగా పెట్టుబడులను ఆకర్షించేందుకు, ప్రభుత్వం బయోటెక్ పార్కులు, టెక్స్టైల్ పార్కులు, హార్డ్‌వేర్ పార్కులుగా వర్గీకరించి రాష్ట్రవ్యాప్తంగా పారిశ్రామిక సమూహాలను ఏర్పాటు చేసింది.
విశాఖపట్నంలో జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ (GIS)-23 20 రంగాలలో 6 లక్షల ఉద్యోగాలను సృష్టించే అవకాశం ఉందన్నారు. ఈ నేపథ్యంలో 352 అవగాహన ఒప్పందాల ద్వారా రూ.13,05,663 కోట్ల పెట్టుబడులను ఆకర్షించింది. గత ఏడాది కంటే 2022-23లో రాష్ట్రం 16.22% వృద్ధిని నమోదు చేసింది. వ్యవసాయం, పారిశ్రామిక, సేవల రంగాలు వరుసగా 36.19%, 23.36%, 40.45% వృద్ధిని నమోదు చేశాయి. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ టేబుల్స్‌లోనూ ఏపీ అగ్రస్థానంలో నిలిచింది. దేశ తలసరి ఆదాయం రూ.2021-22లో రూ.1,48,524 నుంచి 2022-23లో 1,72,000, ఏపీ తలసరి ఆదాయం సంబంధిత సంవత్సరాల్లో రూ.1,92,587 నుంచి రూ.2,19,518కి పెరిగింది.