»Delhi Kcr Arvind Bhagawant Mamata Skips Niti Aayog Meet
NITI Aayog సమావేశానికి కేసీఆర్, అరవింద్, మమత దూరం.. కానీ జగన్ మాత్రం
ఈ సమావేశాలకు రానుపోను ఖర్చు వృథా తప్పా అంతకుమించి ఏమీ జరగదని కొట్టిపారేశారు. సహకార సమాఖ్యకు విలువ లేనప్పుడు నీతి ఆయోగ్ సమావేశానికి హాజరుకావడం హాస్యమే అవుతుందని అరవింద్ కేజ్రీవాల్ పేర్కొన్నారు.
కేంద్ర ప్రభుత్వ తీరుపై నిరసన వ్యక్తం చేస్తూ పలు రాష్ట్రాలు నీతి ఆయోగ్ (NITI Aayog) సమావేశాన్ని బహిష్కరించాయి. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ (K Chandrashekar Rao)తో పాటు మరో ముగ్గురు ముఖ్యమంత్రులు ఈ సమావేశానికి గైర్హాజరు కానున్నారు. నియంతలాగా వ్యవహరిస్తున్న ప్రధాని మోదీ.. నీతి వ్యాఖ్యలు చెబుతూ నిర్వహించే ఈ కార్యక్రమానికి తాము హాజరుకాలేమని ఢిల్లీ (Delhi), పంజాబ్ (Punjab) ముఖ్యమంత్రులు అరవింద్ కేజ్రీవాల్, భగవంత్ మాన్ స్పష్టం చేశారు. ఇక పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కూడా గైర్హాజరవుతున్నారు.
ఢిల్లీలో శనివారం విక్సిత్ భారత్ 2047: టీమ్ ఇండియా ముఖ్యపాత్ర (Viksit Bharat @ 2047: Role of Team India) అనే పేరిట నీతి ఆయోగ్ సమావేశం జరుగనుంది. ప్రధానమంత్రి అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశానికి హాజరైనా ఎలాంటి ప్రయోజనాలు లేవని పలు రాష్ట్రాలు భావిస్తున్నాయి. సమాఖ్య వ్యవస్థకు ప్రతిబింబంగా నీతి ఆయోగ్ సమావేశాన్ని పైకి చెబుతారు.. కానీ అక్కడ రాష్ట్రాలకు ప్రాధాన్యం లేదని పలు రాష్ట్రాలు ఎప్పటి నుంచో వాదిస్తున్నాయి. సమావేశంలో రాష్ట్రాల సమస్యలు వినడం తప్ప పరిష్కారానికి నోచుకోవని.. చెవిటోడి ముందు శంఖం ఊదినట్లు ఉంటుందని గతంలోనే సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఈ సమావేశాలకు రానుపోను ఖర్చు వృథా తప్పా అంతకుమించి ఏమీ జరగదని కొట్టిపారేశారు. ఈ క్రమంలోనే మరోసారి నీతి ఆయోగ్ సమావేశానికి సీఎం కేసీఆర్ గైర్హాజరవుతున్నారు.
కేసీఆర్ మాదిరి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal), మమతా బెనర్జీ, భగవంత్ మాన్ (Bhagwant Mann) కూడా సమావేశాన్ని బహిష్కరిస్తున్నారు. కేంద్రం సమాఖ్య వ్యవస్థకు తూట్లు పొడుస్తోందని.. రాష్ట్రాల హక్కులను కాలరాస్తోందని కేజ్రీవాల్, భగవంత్ ఆరోపించారు. సహకార సమాఖ్యకు విలువ లేనప్పుడు నీతి ఆయోగ్ సమావేశానికి హాజరుకావడం హాస్యమే అవుతుందని అరవింద్ కేజ్రీవాల్ పేర్కొన్నారు. ఢిల్లీ అధికారాల విషయంలో సుప్రీంకోర్టు ఆదేశాలను తుంగలో తొక్కుతున్నారని మండిపడ్డారు. ఇక ప్రతిపక్ష పార్టీలు అధికారంలో ఉన్న రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, తమిళనాడు, బిహార్, కర్ణాటక తదితర రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా నీతి ఆయోగ్ సమావేశానికి గైర్హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి. కాగా, ఈ సమావేశానికి ఏపీ సీఎం జగన్ హాజరవుతున్నారు.