రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) నిర్ణయానికి ముందు స్టాక్ మార్కెట్లు అప్రమత్తంగా కనిపిస్తున్నాయి. నిన్నటి వరకు వరుసగా మూడు రోజుల పాటు నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్ నేడు స్వల్ప నష్టాల్లో ప్రారంభమై, ఆ తర్వాత కాసేపటికి స్వల్ప లాభాల్లోకి వచ్చింది. సోమవారం ప్రారంభమైన ఆర్బీఐ ద్రవ్య పరపతి సమావేశ నిర్ణయాలను నేడు (బుధవారం, డిసెంబర్ ) ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ వెల్లడించనున్నారు. ఈ ప్రకటనకు ముందు మార్కెట్ అప్రమత్తంగా కనిపిస్తోంది. అంతర్జాతీయ మార్కెట్ నుండి ప్రతికూల సంకేతాలు ఉన్నాయి. ఈ ప్రభావం కూడా కనిపిస్తోంది. ఆర్బీఐ రెపో రేటు పెంపును ప్రకటించే అవకాశముంది. అలాగే, దేశీయ ద్రవ్యోల్భణం, వృద్ధి రేటు అంచనాల ప్రకటన తర్వాత అందుకు అనుగుణంగా సూచీలు కదలాడవచ్చు.
నేటి మార్కెట్ ప్రారంభ సమయంలో ఐటీ, ఆటో స్టాక్స్ నష్టాల్లో కనిపించగా, ఎఫ్ఎంసీజీ, ఎనర్జీ రంగాలు లాభాల్లో కనిపించాయి. ఐటీ స్టాక్స్ అయితే భారీగా నష్టాల్లో కనిపిస్తున్నాయి. ద్రవ్యోల్భణం కాస్త అదుపులో ఉన్న నేపథ్యంలో వడ్డీ రేటు లేదా రెపో రేటును గతంలో కంటే కాస్త తక్కువగానే ఆర్బీఐ పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయినప్పటికీ ఏ మేరకు పెంచుతుందనే అంశంపై స్టాక్ మార్కెట్ దూకుడు ఉంటుంది.
ఇప్పటికే భారత వృద్ధి రేటు అంచనాలను వివిధ సంస్థలు సానుకూలంగా ప్రకటించాయి. 2022-23 ఆర్థిక సంవత్సరానికి గాను భారత వృద్ధి రేటు అంచనాలను ప్రపంచ బ్యాంకు నిన్న పెంచింది. జీడీపీ వృద్ధి 6.9 శాతంగా నమోదు కావొచ్చునని తెలిపింది. భారత ఆర్థిక వ్యవస్థ వేగంగా పుంజుకుంటున్నట్లు వరల్డ్ బ్యాంకు పేర్కొంది. అయితే 2023-24 ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు కాస్త నెమ్మదించి, 6.6 శాతంగా నమోదు కావొచ్చునని తెలిపింది. ఆర్బీఐ కూడా భారత వృద్ధి రేటు అంచనాలను కూడా పెంచే అవకాశముంది.