అసలే ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరో షాక్ తగిలింది. కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ సహా వివిధ రూపాల్లో ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చిన దాదాపు రూ.1000 కోట్లను బకాయిల కింద వెనక్కి తీసుకున్నది. నవంబర్ 25వ తేదీన కేంద్రం రాష్ట్రాలకు ఇవ్వాల్సిన జీఎస్టీ మొత్తం రూ.17,000 కోట్లలో ఆంధ్రప్రదేశ్ వాటా 682 కోట్లను విడుదల చేసింది. ఇతర కేటాయింపుల కింద ఈ వారం మరో రూ.300 కోట్లు ఇచ్చింది. మొత్తం రూ.982 కోట్లు వచ్చాయి. ఈ డబ్బులు క్రెడిట్ కాలేదు. అయితే పాత బకాయిల కింద ఈ మొత్తాన్ని కేంద్రం తాజాగా వెనక్కి తీసుకున్నది. ఈ మేరకు రాష్ట్ర అధికారులు ఆరా తీయగా, వాటిని పాత బాకీ కింద సర్దుబాటు చేసుకున్నట్లు ఢిల్లీ నుండి సమాచారం వచ్చింది.
ప్రస్తుతం రాష్ట్రం తీవ్ర ఆర్థిక ఇక్కట్లలో ఉంది. ప్రభుత్వ ఉద్యోగుల వేతనాల నుండి అర్హులకు పెన్షన్ వరకు ఎప్పుడు వస్తాయో తెలియని పరిస్థితి. దాదాపు సగం మంది ఐఏఎస్ అధికారులకు ఇప్పటికీ వేతనాలు అందలేదని తెలుస్తోంది. ఈ వారంలో తమకు వేతనాలు వస్తాయని భావించినట్లు పలువురు ఉద్యోగులు చెబుతున్నారు. ఉద్యోగుల వేతనాలు, పెన్షన్లకు కలిపి రాష్ట్ర ప్రభుత్వం రూ.5,500 కోట్లను ప్రతి నెల ఒకటో తేదీన సమకూర్చుకోవాల్సి ఉంది. ఇవి అందుబాటులో లేక, ఆర్థిక శాఖ మల్లగుల్లాలు పడుతోంది. ప్రభుత్వ ఉద్యోగులకు ఈఎంఐలు, ఇతర అవసరాలు ఉంటాయి. పెన్షన్ దారులు చాలామంది వీటిపైన ఆధారపడుతుంటారు. ఈ డబ్బులు రాక వారు ఇబ్బందులు పడుతున్నారు. నిన్నటి వరకు సచివాలయానికి సంబంధించి ఐదు డిపార్టుమెంట్స్ ఉద్యోగుల వేతనాలు రాలేదని తెలుస్తోంది. పలువురు ఉపాధ్యాయులు వేతనాలు లేక ఆందోళన చెందుతున్నారు.
రోజూ కొంతమందికి వేతనాలు చెల్లించే పరిస్థితి ఇప్పుడు కనిపిస్తోంది. ఇలా ఉద్యోగులందరికీ ఈ నెల 15వ తేదీ వరకు వేతనాలు అందవచ్చునని భావిస్తున్నారు. వేతనాలు, పెన్షన్‌కు గాను రూ.5,500 కోట్లకు గాను దాదాపు మరో రూ.2000 కోట్లకు పైగా చెల్లించాల్సి ఉంది. ఇప్పటికే పరిమితి మించడంతో బహిరంగ మార్కెట్ అప్పుకు వెళ్లలేని పరిస్థితి. వార్షిక రుణ పరిమితి రూ.48,000 కోట్లను ఏపీ మూడో త్రైమాసికానికి ముందే దాటేసింది. కాబట్టి ఓపెన్ మార్కెట్ నుండి తీసుకోవడానికి అవకాశం లేదు. ప్రస్తుత పరిస్థితిని కేంద్ర ఆర్థిక శాఖ దృష్టికి తీసుకు వెళ్తామని ఆర్థిక శాఖ అధికారులు చెబుతున్నారు. చెల్లింపుల కోసం గత నెలలో ఆర్బీఐ నుండి రూ.1500 కోట్ల అప్పు, ఆ తర్వాత ఓ కార్పోరేషన్ బ్యాంకు నుండి రూ.2000 కోట్ల రుణం, కేంద్రం నుండి ఐజీఎస్టీ రూ.1500 కోట్లు వచ్చాయి. వీటి ద్వారా కొన్ని చెల్లింపులు చేసినట్లుగా తెలుస్తోంది.