దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా మూడో రోజు నష్టాల్లో ముగిశాయి. నిన్న స్వల్ప నష్టాల్లో ముగిసిన మార్కెట్, నేడు అంతకుమించి నష్టపోయింది. ఫెడ్ రిజర్వ్ వడ్డీ రేట్ల పెంపు మరికొంతకాలం కొనసాగించనుందనే వార్తల నేపథ్యంలో అమెరికా మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. క్రూడాయిల్ ధరలు మళ్లీ పెరిగాయి. ఇలా అంతర్జాతీయ మార్కెట్ ప్రభావం, బుధవారం ఆర్బీఐ రెపో రేటు సహా ఇతర నిర్ణయాలు, వివిధ రంగాల్లో అమ్మకాలు వెల్లువెత్తడంతో మార్కెట్ నష్టపోయింది. సెన్సెక్స్ 208 పాయింట్లు నష్టపోయి, 62,626 పాయింట్ల వద్ద, నిఫ్టీ 58 పాయింట్లు నష్టపోయి 18,642 పాయింట్ల వద్ద ముగిసింది. సెన్సెక్స్ ఓ సమయంలో 400 పాయింట్లకు పైగా నష్టాల్లోకి వెళ్లినప్పటికీ ఆ తర్వాత కాస్త కోలుకుంది.
దేశీయంగా రేపు ఆర్బీఐ పరపతి సమీక్ష సమావేశం నేపథ్యంలో ఇన్వెస్టర్లు అప్రమత్తత పాటించారు. మెటల్, ఐటీ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. బ్యాంకు నిఫ్టీలో ప్రాఫిట్ బుకింగ్ కనిపించింది. టాటా స్టీల్స్, డాక్టర్ రెడ్డీస్, ఇన్ఫోసిస్, ఎస్బీఐ, భారతీ ఎయిర్ టెల్ వంటి సంస్థలు మార్కెట్‌ను ఎక్కువగా దెబ్బతీశాయి. హిందూస్తాన్ యూనీలీవర్, పవర్ గ్రిడ్, అల్ట్రా టెక్ సిమెంట్, నెస్ట్లే స్టాక్స్ భారీ నష్టాల్లో ముగిశాయి. జనవరి నుండి టాటా మోటార్స్ వాహనాల ధరలను పెంచేందుకు సిద్ధమవుతోంది. ఈ ప్రభావం ఈ స్టాక్ పైన ఉంటుంది.
ఐడీబీఐ బ్యాంకులోకి 51 శాతం విదేశీ ఫండ్స్‌కు కేంద్రం ఆమోదం తెలిపే అవకాశం ఉందనే వార్తల నేపథ్యంలో ఈ స్టాక్ భారీగా లాభపడింది. ఇది 7.5 శాతం మేర ఎగిసి 58.30 వద్ద ముగిసింది. 30 స్టాక్స్‌లో 14 లాభాల్లో, 16 నష్టాల్లో ముగిశాయి. ఈ రోజు బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఐడీబీఐ, రాష్ట్రీయ కెమికల్స్, ఇండియన్ బ్యాంకు, బ్యాంక్ ఆఫ్ బరోడా స్టాక్స్ 52 వారాల గరిష్టాన్ని తాకాయి.