జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ఏపీ మంత్రి అంబటి రాంబాబు ప్రశ్నల వర్షం కురిపించారు. ఎన్నికలు దగ్గరపడుతుండటంతో… పవన్ కి కనీసం ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలి అనే విషయం కూడా క్లారిటీ లేదు అనే అర్థం వచ్చేలా ఆయన మాట్లాడటం గమనార్హం.
మళ్ళీ భీమవరం నుంచి పోటీ చేస్తావా?? లేదా గాజువాక నుంచి పోటీ చేస్తావా? లేదా కనీసం 25 స్థానాల్లో అయినా పోటీ చేస్తావా?? ఎవరితో కలిసి పోటీ చేస్తావ్?? అంటూ ఆయన ప్రశ్నించారు. అంతేకాక పవన్ పై అంబటి ప్రశ్నల వర్షం కురిపించారు. రౌడీని రౌడీ అంటే రౌడీ లాగే పవన్ రియాక్ట్ అయ్యారని, పవన్ వెంట ఎవరైనా వెళ్తే కుక్క తోక పట్టుకుని గోదావరి ఈదినట్టే అని అన్నారు. ఇళ్లు కూలినట్టు పవన్ ఇప్పటం గ్రామస్తులతో దొంగ సంతకాలు పెట్టించారన్న ఆయన ఇప్పటం ప్రజలు ఉద్యమం చేశారా?? అని ప్రశ్నించారు.
దొంగ సంతకాలు పెట్టి కోర్టుతో పెనాల్టీ వేయించుకోవడం ఉద్యమం చేయటమా?? అని అంబటి ప్రశ్నించారు. ఇప్పటంలో పవన్ అసలు రంగు బయటపడిందన్న అంబటి అమరావతిలో అసలు రైతులు ఉన్నారా?? అని ప్రశ్నించారు. ఐడెంటిటీ కార్డ్ అడిగితే దొంగ రైతులు పారిపోయారని ఎద్దేవా చేశారు. 151 సీట్లు వచ్చినపుడు పవన్ వేలు ఎక్కడ పెట్టుకున్నాడు?? అని ప్రశ్నించిన అంబటి సినిమాల్లో కామెడీ క్యారెక్టర్ లాంటి వాడు పవన్ కళ్యాణ్ అంటూ ఎద్దేవా చేశారు. ఇక అమరావతిలోనే రాజధాని ఉండాలని, ఆరు నెలల్లోనే నిర్మాణాలు పూర్తి చేయాలనే హైకోర్టు తీర్పు పై సుప్రీంకోర్టు స్టే విధించిందని ఆయన అన్నారు.
సుప్రీంకోర్టు తీర్పు వికేంద్రీకరణకు బలాన్ని ఇస్తుందని, అలాగే రాజధానుల నిర్ణయంలో న్యాయస్థానాల జోక్యం సరైంది కాదని దీన్ని బట్టి అర్థం అవుతోందని అన్నారు. ఈ మధ్యంతర ఉత్తర్వుల తర్వాత అయినా చంద్రబాబుకు ఙానోదయం అవుతుంది అని నేను భావిస్తున్నానని ఆయన అన్నారు. అంతేకాక అరసవిల్లి వరకు పాదయాత్ర తాత్కాలికం కాదు శాశ్వతం అని నేను అప్పుడే చెప్పానని అన్నారు. ఇప్పుడైనా ఇటువంటి అడ్డంకులు సృష్టించే ప్రయత్నాలను చంద్రబాబు ఆపాలని అన్నారు. అమరావతి ప్రాంతంలోని నిజమైన రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అంబటి పేర్కొన్నారు.