వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో కచ్చితంగా బీజేపీనే గెలుస్తుందని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా పేర్కొన్నారు. దక్షిణ భారతదేశంలో బీజేపీ ఎంట్రీ ఇవ్వబోతోందని ఆయన పేర్కొన్నారు. రాబోయే ఎన్నికల్లో బంపర్ మెజార్టీతో తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నట్టు చెప్పారు. ఈ విషయంలో ఎటుంటి అనుమానం అక్కర్లేదన్నారు. తాను తరచూ తెలంగాణకు వెళ్తున్నానని ఆయన చెప్పారు. క్షేత్రస్థాయిలో ఉన్న ప్రజల పల్స్ తనకు తెలుసని ఆయన చెప్పుకొచ్చారు.
తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని చెప్పారు. తెలంగాణలో టీఆర్ఎస్ ను గద్దె దించి భారీ మెజారిటీతో తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నట్టు వెల్లడించారు. గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ తో పాటు ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ లోనూ బీజేపీ విజయ ఢంకా మోగిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
‘రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రను స్వాగతిస్తున్నాము. ప్రయత్నాలు ఎవరైనా చేయవవచ్చు. కానీ ప్రయత్నం ఫలితం అనేది లక్ష్యం నెరవేరినప్పుడే. భవిష్యత్‌లో రాహుల్ గాంధీ యాత్ర ఫలితం తేలిపోతుంది. వీర్ సావర్కర్‌ను బీజేపీ మాత్రమే కాదు దేశం మొత్తం గౌరవిస్తోంది’అని అన్నారు.
భారత భూభాగాన్ని చైనా ఆక్రమిస్తోందంటూ ప్రతిపక్షాల ఆరోపణలపై ఆయన స్పందిస్తూ… ఒక్క ఇంచు భూభాగాన్ని కూడా విదేశీయుల కబ్జా కిందకు కిందకు వెళ్లనిబోమన్నారు. 2047 నాటికి భారత్ పూర్తిగా అభివృద్ధి చెందిన దేశంగా అగ్రగామిగా నిలవాలని దేశం మొత్తానికి మోడీ లక్ష్యాన్ని నిర్దేశించారన్నారు.