కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రస్తుతం జోడో యాత్రలో పాల్గొంటున్న సంగతి తెలిసిందే. ఆయన యాత్రలో పలు రాష్ట్రాలకు చెందిన సెలబ్రెటీలు సైతం పాల్గొంటున్నారు. ఈ క్రమంలోనే మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, బాక్సర్, ఒలింపిక్ పతక విజేత విజేందర్ సింగ్ శుక్రవారం నిర్వహించిన యాత్రలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన రాహుల్ గాంధీతో కలిసి నడిచిన సమయంలో చోటు చేసుకున్న పరిణామం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.మధ్యప్రదేశ్ లోని ఖార్గోన్ లో కొనసాగుతున్న భారత్ జోడో యాత్రలో విజేందర్ సింగ్ పాల్గొన్నారు. కొన్ని కిలో మీటర్ల పాటు రాహుల్ గాంధీతో కలిసి నడిచారు.
వీరిద్దరు కలిసి నడుస్తున్న సమయంలో ఒకరుతో ఒకరు మాట్లాడుకున్నారు. సెల్పీలు తీసుకున్నారు. రాహుల్ విజేందర్ ఇద్దరు కలిసి మీసాలు తిప్పారు. వీరి మధ్య జరిగిన ఈ సంభాషణ తీరునంతా కాంగ్రెస్ శ్రేణులు వీడియో తీసి, భారత్ జోడో యాత్ర ట్విట్టర్ అకౌంట్ ద్వారా షేర్ చేశారు. ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.