సెర్బియా(Serbia) రాజధాని బెల్గ్రేడ్కు 30 మైళ్ల దూరంలో మరోసారి కాల్పులు జరిగాయి. ఈ తాజా కాల్పుల్లో 8 మంది మరణించగా, మరో 13 మంది గాయపడ్డారు. గురువారం రాత్రి రాత్రి 11 గంటలకు ఇది జరిగినట్లు తెలుస్తోంది. మ్లాడెనోవాక్ అనే పట్టణానికి సమీపంలో ఓ దుండగుడు ఈ కాల్పులకు పాల్పడ్డట్లు అధికారులు చెబుతున్నారు. దాడి చేసిన తర్వాత ఘటనా స్థలం నుంచి పారిపోయాడని అంటున్నారు. అయితే సెర్బియాలో కాల్పులు జరగడం ఇది రెండో సారి. సెర్బియాలో రెండు రోజుల క్రితం ఓ టీనెజర్ రెచ్చిపోయి స్కూల్ వద్ద కాల్పులు జరుపగా.. ఈ ఘటనలో 8 మంది చిన్నారులు, ఓ గార్డ్ చనిపోయాడు. తీవ్రంగా గాయపడిన వారిని అత్యవసర కేంద్రానికి తరలించినట్లు అధికారులు తెలిపారు.
ఈ నేపథ్యంలో వందలాది సెర్బియా దళాలు దేశంలో కాల్పులు జరిపిన ముష్కరుడి కోసం వేటాడుతున్నాయి. దాడి చేసిన వ్యక్తి దాక్కున్నాడని భావించిన ప్రాంతాన్ని చుట్టుముట్టినట్లు తెలుస్తోంది. ముష్కరుడు రాజధానికి దక్షిణంగా ఉన్న మ్లాడెనోవాక్ అనే పట్టణానికి సమీపంలో కదులుతున్న వాహనం నుంచి ఆటోమేటిక్ ఆయుధాన్ని ఉపయోగించాడని సమాచారం. మరోవైపు సెర్బియా మంత్రి బ్రాటిస్లావ్ గాసిక్ ఈ కాల్పులను ఉగ్రవాద చర్య అని ఆరోపించారు. మరోవైపు అతని కోసం పోలీసులు హెలికాప్టర్లను మోహరించారు.