ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లో కొనసాగుతున్న ప్రజా వ్యతిరేక పాలనపై తెలంగాణ (Telangana) మంత్రుల విమర్శల పరంపర కొనసాగుతోంది. గతంలో హరీశ్ రావు (Harish Rao), కేటీఆర్ (KT Rama Rao) తదితర మంత్రులు విమర్శలు చేయగా.. తాజాగా మరోసారి మల్లారెడ్డి (Malla Reddy) కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో నత్తనడకన సాగుతున్న పోలవరం ప్రాజెక్టును (Polavaram Project) తెలంగాణ సీఎం కేసీఆర్ (KCR) పూర్తి చేస్తారని ప్రకటించారు. విశాఖ ఉక్కు పరిశ్రమను (Vizag Steel Plant) కూడా కాపాడేది కేసీఆర్ అని తెలిపారు.
హైదరాబాద్ (Hyderabad)లోని రవీంద్రభారతిలో (Ravindra Bharathi) సోమవారం నిర్వహించిన అంతర్జాతీయ కార్మిక దినోత్సవం (Labour Day) కార్యక్రమంలో మల్లారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా తనదైన శైలిలో ప్రసంగించారు. కార్మిక శాఖ ఉన్న మల్లారెడ్డి ‘ఆంధ్ర ఔటైపోయింది. మహారాష్ట్రలో సీఎం కేసీఆర్ ను చూసి లక్షల మంది ప్రజలు వస్తున్నారు. ఆంధ్రలో కుల రాజకీయాలు (Caste Politics) చేస్తున్నారు. రెడ్డి, కాపు, కమ్మ రాజకీయం చేస్తున్నారు. ఏపీని పట్టించుకునేది కూడా కేసీఆర్. పోలవరం ప్రాజెక్టును కట్టేది కేసీఆర్. విశాఖ ఉక్కును కాపాడేది కేసీఆర్. మన బలం మనకు తెల్వదు. మహారాష్ట్ర, కర్ణాటక, ఏపీలో కేసీఆర్ హవా పెరుగుతుంది. 2014లో రెండు రాష్ట్రాలు విడిపోయినా ఆంధ్రలో పోలవరం పూర్తి కాలేదు. కానీ తెలంగాణలో కాళేశ్వరం (Kaleshwaram) పూర్తయ్యింది. తెలంగాణలో ఉన్న ఉన్నత విద్య ఉత్తమంగా ఉండడంతో ఏపీ నుంచి విద్యార్థులు పెద్ద ఎత్తున తెలంగాణ ఎంసెట్ (EAMCET) రాశారు’ అని మల్లారెడ్డి తెలిపారు.
ఇక నరేంద్ర మోదీ, కేంద్ర ప్రభుత్వంపై మల్లారెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. వచ్చే ఎన్నికల్లో నరేంద్ర మోదీ ఇంటికి వెళ్తాడని.. వచ్చేది బీఆర్ఎస్ (BRS Party) ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ పిరం ప్రధాని (Costly Prime Minister) అని అభివర్ణించారు. గ్యాస్, ఉప్పుపప్పూ, పెట్రోల్, డీజిల్ ధరలు పెంచి పేదలను దోచేస్తున్నాడని విమర్శించారు. పేదలను దోచేసి గౌతమ్ అదానీకి కట్టబెట్టారని ఆరోపించారు. మోదీ ప్రధాని అయ్యాక అదానీ ప్రపంచ కుబేరుడు అయ్యాడని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ సంస్థలను కారుచౌకగా కట్టబెడుతున్నాడని చెప్పారు. అనంతరం విధి నిర్వహణలో ప్రతిభ కనబర్చిన కార్మికులకు శ్రమశక్తి అవార్డులను మంత్రి మల్లారెడ్డి ప్రదానం చేశారు.